Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాములు నాయక్
- సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రకు వైరాలో సంఘీభావం
- ఎరుపెక్కిన వైరా పట్టణం
నవతెలంగాణ-వైరా/ వైరా టౌన్
ప్రజా వ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం ఖమ్మం జిల్లా వైరాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. వైరా పట్టణంలోని మధిర రింగ్ రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే హాజరై తమ్మినేని వీరభద్రంను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గ్యాస్, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, కరెంట్ ధరల పెంచుతూ సామాన్య మానవుడి నడ్డి విరుస్తోందన్నారు. వీటన్నింటినీ రాబోయే రోజుల్లో ప్రజలు చైతన్యవంతంగా, సమర్థవంతంగా అడ్డుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ చైర్మెన్ బీడీకే రత్నం, మున్సిపల్ వైస్ చైర్మెన్ ముల్లపాటి సీతారాములు, పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్ట కృష్ణార్జున్రావు, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్ పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ
బీజేపీ మతోన్మాద, కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడానికి, సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మార్చి 17న ప్రారంభమైన జన చైతన్య యాత్ర బుధవారం వైరా పట్టణానికి చేరుకున్నది. అభ్యుదయ పాటలు, నృత్యాలు, వివిధ కళా రూపాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో పట్టణం ఎరుపెక్కింది. వైరా మండలం స్టేజి పినపాక గ్రామం వద్ద సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఎర్రజెండాలు కట్టుకుని, ఎర్ర చొక్కాలు ధరించి పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైరా రింగ్ రోడ్డు సెంటరులో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబా మాట్లాడారు.