Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్తవ్యస్థంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు
- నాలుగున్నరేండ్లుగా 40 శాతమే
- తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు
- దెబ్బతింటున్న వ్యాపారాలు
- చురుగ్గా సాగని ఎలివేటేడ్ కారిడార్ ప్రాజెక్టు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజాభివృద్ధి ప్రాజెక్టుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు నిర్మాణం నత్తకే నడక నేర్పుతున్నది. వర్కింగ్ ఏజెన్సీతోపాటు అధికారులు ఆశించినస్థాయిలో చురుగ్గా వ్యవహరించకపోవడంతో నాలుగున్నరేండ్లుగా పనులు స్థంభించాయి. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమమవుతున్నాయి. కేంద్రం ప్రారంభించిన ఒకే ఒక్క ప్రాజెక్టు ఏండ్లతరబడి ఆపసోపాలు పడుతుండగా, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలను పూర్తిచేసి అందుబాటులోకి తేవడం చర్చనీయాంశమవుతున్నది.
జనం అవస్థలు
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. నిర్మాణం చేపట్టి నాలుగున్నరేండ్లవుతున్నా, 40 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( జీహెచ్ఎంసీ ) అధికారులు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రెండేండ్లలోనే 6.2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేసి జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ (ఎన్హెచ్ఏఐ)కి అప్పగించారు. కానీ పనుల పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. రోడ్డు మధ్యన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉప్పల్, మేడిపల్లి మధ్య ప్రయాణానికి కనీసం గంట సమయం పడుతున్నది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ప్రయాణం నరకప్రాయమవుతున్నది. ఉప్పల్ రింగ్‌రోడ్డు, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, పండుగల సమయంలోనైతే ప్రయాణీకుల బాధలు వర్ణనాతీతం. ట్రాఫిక్ సమస్య మరింత పెరిగి వాహనదారుల్లో అసహనం పెంచుతున్నది. సహనానికి పరీక్షగా మారుతున్నది.
ప్రాజెక్టు ఉద్దేశం..
ఉప్పల్ - మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యకు చరమగీతం పాడేందుకు ఈ ఆరు లేన్ల స్కైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 163 జాతీయ రహదారిపై 6.2 కిలోమీటర్ల మేర 148 పిల్లర్లతో పనులకు శ్రీకారం చుట్టారు. 2018 జూలైలో పనులు ప్రారంభం కాగా, 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం. ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. కారిడార్ పనులు పూర్తయితేనే దెబ్బతిన్న రోడ్డు పనులు పూర్తిచేయగలమని అధికారులు అంటున్నారు.
ఫ్లైఓవర్ల నిర్మాణం వేగం
రాష్ట్రంలో ఎస్సార్డీపీ పథకం మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. ఇప్పటివరకు రూ.3748.85 కోట్లతో 31 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 15 ఫ్లైఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జి, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు రావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. ఇక రూ. 4304.07కోట్లతో 16 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య తొలగిపోయింది. ఈ ఏడాది మార్చి 10న ఉప్పల్-రామంతాపూర్ రోడ్డులో రూ.411 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే 40 శాతం మేర పిల్లర్స్ పనులు పూర్తయ్యాయి.
భారత్‌మాల...
ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పథకం కింద చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.626.80 కోట్ల వ్యయంతో ఉప్పల్-నారపల్లి మధ్య నిర్మిస్తున్న ఈ ఆకాశ మార్గానికి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2018, మే నెలలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నాలుగున్నరేండ్లు గడిచినా ఈ నిర్మాణం నత్తనడక సాగుతున్నది. 40 శాతం పనులే పూర్తయ్యాయనీ, ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తే ఈ ఫ్లై ఓవర్ మరో రెండేండ్లలో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివద్ధి ప్రాజెక్టు (ఎస్సార్డీపీ)లో భాగంగా షేక్‌పేట వద్ద అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మించింది. రూ.333.55 కోట్ల వ్యయంతో 2.80 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌కు 2018 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరుగగా, ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు నాలుగు లక్షల మంది ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం లభించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 30 ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చింది.
దెబ్బతిన్న వ్యాపారాలు
ఎలివేటెడ్ కారిడార్ పనులు, రోడ్డు పనులు తీవ్ర ఆలస్యమవుతుండంతో ఉప్పల్ ప్రధాన రహదారిలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యాపార సముదాయాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసే అవకాశమే లేదు. లాభం కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. పనులు పూర్తిచేసి, రోడ్ల నిర్మాణం జరిగితే కనీసం వ్యాపారం కొనసాగించడానికి వీలుంటుందని స్థానిక వ్యాపారులు అభిప్రాయడుతున్నారు.
ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టమే
ఉప్పల్-మేడిపల్లి రోడ్డులో ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టంగా మారింది. శుభకార్యాలు, ఉదయం, సాయంత్రం రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి సిబ్బంది చాలా శ్రమించాల్సి వస్తున్నది. రోడ్డు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగుతున్నది. దీనితో ఇది ప్రజలకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నదని స్థానిక ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.