Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారుల సుందరీకరణలో హెచ్ఎండిఏ కీలకపాత్ర
- వరంగల్, నాందేడ్ నేషనల్ హైవేలపై రూ.18.61 కోట్లతో పనులు పూర్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నది. మండు వేసవిలోనూ పచ్చదనంతో, పూల వనాలతో హైదరాబాద్‌కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటికి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి అనుసంధానంగా ఉన్న నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల సుందరీకరణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ తరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హెచ్ఎండీఏ ''మల్టీలేయర్ ప్లాంటేషన్'' గ్రీనరీని జనగామ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ పురపాలక శాఖను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్‌ను తలపించేలా పచ్చదనాన్ని నెలకొల్పాలని మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖకు సూచించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండీఏ యుద్ధపాతిపదికన ఈ పనులను పూర్తి చేసింది. ''తెలంగాణకు హరితహారం'లో భాగంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్, వరంగల్ నేషనల్ హైవే(ఎన్‌హెచ్-163)వెంట జనగామ వరకు దాదాపు రూ.15.04 కోట్లతో హెచ్ఎండీఏ రూపొందించిన ''మల్టీలేయర్ ప్లాంటేషన్'' ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే రూ.15.04 కోట్లతో వరంగల్ హైవే వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్లతో నాందేడ్ హైవే (ఎన్‌హెచ్-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తయ్యాయి. శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్-765) వెంట శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహణ, కర్నూలు హైవే (ఎన్‌హెచ్-44) వెంట అరాంఘర్ నుంచి షాద్‌నగర్ వరకు 25 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్‌ను హెచ్ఎండీఏ నిర్వహించింది. రాజీవ్ రహదారి స్టేట్ హైవే (ఎన్‌హెచ్-1) వెంట శామీర్‌పేట నుంచి గజ్వేల్ వరకు దాదాపు 39 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహించింది. హెచ్ఎండీఏ గ్రీనరీపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది. నాందేడ్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్-161) వెంట హెచ్ఎండిఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్‌తో పచ్చదనాన్ని పరిమళింప చేస్తున్నది. కంది క్రాస్ రోడ్స్ (చౌరస్తా) నుంచి రామ్‌సాన్‌పల్లె వరకు 32.77 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.3.57 కోట్ల వ్యయంతో సెంట్రల్ మిడెన్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేసింది.
గ్రీన్ కారిడార్‌గా హైదరాబాద్ - వరంగల్ హైవే
రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన నేపధ్యంలో వరంగల్ నేషనల్ హైవే(163) వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రెండేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం కేసీఆర్ వరంగల్ హైవే వెంట గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. తొలి దశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున.. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ పనులు అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో పూర్తయ్యాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ''మల్టీలేయర్ ప్లాంటేషన్'' వరంగల్ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి కావడంతో వరంగల్ రహదారి వెంట ఆకు పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి.
యాదాద్రి రూట్లో హెచ్ఎండీఏ పెంచిన మల్టీ లేయర్ ప్లాంటేషన్ నేషనల్ హైవే అథారిటీకి ఆదర్శంగా నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్(ఈస్ట్) వారణాసి నేషనల్ హైవే వెంట హెచ్ఎండీఏ తీర్చిదిద్దిన ''యాదాద్రి రూట్ మల్టీ లేయర్ ప్లాంటేషన్'' మోడల్ ను గతంలో నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్(ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య అధ్యయనం చేశారు. ఇటీవల కేరళ రాష్ట్రానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారుల బృందం యాదాద్రి నేషనల్ హైవేను పరిశీలించింది. అంతేకాకుండా బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థి హెచ్ఎండీఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై అధ్యయనం చేశారు.