Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే దేశం.. ఒకే మతం అంటున్న మోడీషా
- ఒకే కులం ఎందుకు అనట్లేదు?
- రాజ్యాంగం స్థానంలో మనుధర్మం తేవాలని ఎత్తుగడ
- బీజేపీ కాపలా కుక్క ఈడీ.. ప్రతిపక్షాలపై దాడి : తమ్మినేని
- ఇంటి నిర్మాణానికి రాష్ట్రం ఐదు లక్షలు, కేంద్రం పది లక్షలివ్వాలి
- ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గబోం.. ొవైరా, మధిర, బోనకల్లో యాత్రకు ఘన స్వాగతంకె. శ్రీనివాసరెడ్డి,
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అగ్రవర్ణాల ఆధిపత్య రాజ్యమే బీజేపీ లక్ష్యమని, ఒకే దేశం, ఒకే మతం అంటున్న మోడీషాలు.. ఒకే కులం అని ఎందుకు అనట్లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కుల వ్యవస్థను కొనసాగించాలనేది వారి సిద్ధాంతం.. బీజేపీ సిద్ధాంతానికి అవరోధంగా ఉన్న కమ్యూనిస్టులు, భారత రాజ్యాంగాన్ని తప్పించాలని వారి ఎత్తుగడగా ఉందన్నారు. అందుకే రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కాపలా కుక్క ఈడీని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని చెప్పారు. సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రలో భాగంగా బుధవారం వైరా, మధిర, బోనకల్ మండలం రావినూతలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తమ్మినేని మాట్లాడారు. ఉగాది పండుగ అయినా భారీగా తరలివచ్చిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి రామునిపైన కాదు భక్తి.. దేశంలో కులవ్యవస్థను రక్షించాలనే ఆసక్తి అన్నారు. ఒకే దేశం.. హిందూ దేశం అంటున్న బీజేపీ ఒకే కులాన్ని ఎందుకు కోరుకోవడం లేదని ప్రశ్నించారు. దేశంలో 60 వేల కులాలున్నాయని, వీరిలో 52శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్ గురించి బీజేపీ ఎందుకు మాట్లా డదన్నారు. వర్గాలు, వైషమ్యాలు, పగలు, కక్షలను పెంచిన బీజేపీ ఏనాడైనా అన్ని కులాలు ఒక్కటని మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు, అంబేద్కర్ వల్ల కులవ్యవస్థ బలహిన పడుతుందని బీజేపీ భావిస్తోందన్నారు. అందుకే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు గోల్వాల్కర్, సావర్కర్ పరమ చెత్త, అతుకుల బొంత అని అభివర్ణించారని గుర్తు చేశారు. పార్టీలు మారే అలవాటున్న వాళ్లు ఫాసిస్టు బీజేపీ వైపు పోవద్దని హితవు పలికారు. దుర్మార్గపు ప్రణాళిక ఉన్న బీజేపీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల న్నారు.
మోడీని గద్దె దించేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలను సమీకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రయివేటీకరణకు పూనుకుందన్నారు. ప్రయివేటీ కరణ వెనుక పేదల రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర దాగుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ధైర్యం గా నిలబడుతున్నారు కాబట్టే కలిసి నడుస్తున్నామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికలపై చర్చ ఉంటుందని, చావైనా బతుకైనా సీపీఐ, సీపీఐ(ఎం) మాత్రం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నాయన్నారు. బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నాం కదా..! ఇక ప్రజా సమస్యల మాటేమిటి అనుకోవచ్చు.. ప్రజలకు కంటనీరు తెప్పించే పనులు చేస్తే కేసీఆర్నైనా నిలదీస్తామన్నారు. ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మోడీ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని తమ్మినేని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? 2022నాటికి దేశంలో ఉన్నవాళ్లందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.. ఏమయ్యాయని నిలదీశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే బెదిరింపులు, దాడులు చేస్తున్నారన్నారు. కాగితాల పైన ఉండే మోసపూరిత కంపెనీలతో అదానీ రూ.17 లక్షల కోట్లు దోచినా చర్యలు ఉండవా? అన్నారు. రాష్ట్రాల హక్కుల్ని బీజేపీ హరిస్తోందని ఆరోపించారు. ఆర్థిక సార్వభౌమత్వాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలను తప్ప 85శాతం హిందువుల మేలుకోరే పార్టీ బీజేపీ కాదన్నారు. బీజేపీ విషనాగు వంటిందని.. దాని ప్రమాదాన్ని నిలువరించడానికే బీజేపీ వ్యతిరేక పార్టీలతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
బీజేపీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి : పోతినేని
బీజేపీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు సూచించారు. సీసీఐ, మార్క్ ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థలను ఎత్తేసి రైతులను అగాధంలోకి నెట్టేయాలని చూస్తోందన్నారు. రైతులు అప్రమత్తం కాకపోతే మనభూమి మనకే దక్కదని హెచ్చరించారు.
మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఏమైంది?: మల్లు లక్ష్మి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఏమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ హెల్త్ ఇన్సూరెన్స్ సంగతేంటన్నారు. బీజేపీ ఆడవాళ్ళ స్వేచ్చను హరించి వేయాలని చూస్తుందన్నారు.
బీజేపీ విధానాలు నష్టదాయకం: సాయిబాబు
యావత్ భారతదేశానికి బీజేపీ విధానాలు నష్టదాయకమని సీఐటీయూ జాతీయ నాయకులు ఎం.సాయిబాబు అన్నారు. ఆ విధానాలు లౌకిక తత్వం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని తెలిపారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తాయన్నారు. అందుకే ప్రమాదకర బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సభల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
యాత్రకు సంఘీభావం
జన చైతన్య యాత్రకు బీఆర్ఎస్, సీపీఐ నాయకత్వం సంఘీభావం తెలిపింది. వైరాలో బీఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, మధిరలో జడ్పీ చైర్మెన్ లింగాల కమల రాజ్, సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటించారు.