Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీపై గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి వినతి
- మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలని విజ్ఞప్తి
- ఐటీ శాఖ ఉద్యోగులదే కీలక పాత్ర ొ టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యుల్ని సస్పెండ్ చేయాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేపర్ లీకేజీలో విచారణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కోరారు. మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ లీకులో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ఐటీ శాఖ ఉద్యోగులే కీలక పాత్ర వహించారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉన్నదని తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్టు రేవంత్ చెప్పారు. పేపర్‌ను దొంగిలించి కోట్ల రూపాయలకు అమ్ముకుని లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ పీఏపై ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు. ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్‌కు విశేష అధికారాలున్నాయనీ, వాటి ప్రకారం ఇప్పుడున్న బోర్డులో ఉన్న అందర్ని సస్పెండ్ చేయాని కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకు కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదనీ, పారదర్శక విచారణకు గవర్నర్ అనుమతి కోరామని తెలిపారు. ఇది లక్షలాది అభ్యర్థుల సమస్యకాదనీ, లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య అని అన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నదని ఆరోపించారు. గతంలో వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తోపాటు చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.
రేేవంత్ వెంట నడవండి...
గాంధీభవన్ ఉగాది వేడుకల్లో పంచాంగ కర్త ఉద్బోధ
నేతలంతా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వెంట నడవాలని పంచాగ కర్త చిలుకూరు శ్రీనివాస మూర్తి ఉద్బోధించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం పఠించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతున్నదని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారని చెప్పారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని చెప్పారు. నూతన రాజకీయ కూటములు ఏర్పడుతాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అల్లర్లు ప్రజలను ఇబ్బంది పెడతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బలహీన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. రాహుల్ స్ఫూర్తితో ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారనీ, ప్రజలు నచ్చేలా నడుచుకోవాలని సూచించారు.