Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 42 మందికి సిట్ నోటీసులు
- టీఎస్పీఎస్సీ ఓ జీరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. మంగళ వారం నిందితులను మూడు వేర్వేరు చోట్ల అధికారులు విచారించి స్టేట్మెంట్స్ను రికార్డు చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారంతో నిందితుల కస్టడీ ముగుస్తుండటంతో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. దాంతో డొంక కదులుతోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్.. ఐదోరోజు బుధవారం దాదాపు 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో గ్రూప్1 పరీక్ష రాసిన పలువురితోపాటు టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు ప్రశ్నించిన
సిట్ కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ లోని టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధాలున్న వారికి నోటీసులు జారీ చేశారు. వారిని సైతం ప్రశ్నించి మరింత సమాచారం రాబట్టాలని ఆధికారులు యోచిస్తున్నారు.
గ్రూప్1కు 10, 12 మంది క్వాలీఫై?
ఐదురోజులుగా ప్రవీణ్, రాజశేఖర్‌ను వేర్వేరుగా విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించారు. రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సురేష్ అనే ఉద్యోగిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ గ్రూప్-1 పేపర్‌ను సురేష్‌కు ఇవ్వడంతోనే సురేష్ క్వాలిఫై అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా టీఎస్పీఎస్సీలోపని చేస్తున్న దాదాపు 10, 12 మంది ఉద్యోగులు కూడా గ్రూప్-1 పరీక్ష రాశారనీ, వారందరూ మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్టు సిట్ అధికారుల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో ఏడుగురు రెగ్యులర్, ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నట్టు తెలిసింది. ప్రవీణ్, రాజశేఖర్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు పరిశీలించారు. నిందితులకు ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయోనని ఆరా తీశారు. ఇదిలావుండగా, ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నీలేశ్, గోపాల్ ద్వారా రూ.13.50 లక్షలు అందినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. బుధవారం విచారణ అనంతరం తొమ్మిది మంది నిందితులను సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు.
కలకలం రేపిన వాల్ పోస్టర్లు
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఓ జీరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభిస్తాయంటూ ఓయూ జేఏసీ పేరుతో పోస్టర్లు అంటించారు. పలు డిమాండ్లతోపాటు కొన్ని ప్రశ్నలను ఈ పోస్టర్ ద్వారా లేవనెత్తారు. వారం రోజులుగా విద్యార్థిలోకాన్ని విస్మయానికి గురిచేస్తున్న టీస్పీఎస్సీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.