Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి దేశవ్యాప్తంగా 4.80 లక్షల మరణాలు
- రాష్ట్రంలో రెండు నెలల్లో 12 వేలకు పైగా కేసులు
- నేడు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్దేశించుకున్న లక్ష్యానికి తగినట్టు కార్యాచరణ లేకపోవడం, కార్యక్రమాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించడంతో ఇప్పటికీ క్షయ మహమ్మారి దేశ, రాష్ట్ర ప్రజలను పీడిస్తూనే ఉన్నది. 2025 నాటికి క్షయరహిత భారత్, తెలంగాణగా మార్చాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం నెరవేరాలంటే ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు గుర్తించిన వారికి మెరుగైన చికిత్సను అందించడమే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 4.80 లక్షల మంది అంటే ప్రతి రోజు 1,300 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ క్షయవ్యాధిగ్రస్తుల్లో సగం మంది మన దేశంలోనే ఉండటం ఈ వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నది. రాష్ట్రంలోనూ కొత్తగా నమోదవుతున్న కేసులు ఆగడం లేదు. 2021లో 60,794 కేసులు నమోదు కాగా, 2022లో 72,911, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 12,259 కేసులు వెలుగులోకి వచ్చాయంటే ఈ వ్యాధి తీవ్రత ఏంటో అర్థమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అంటురోగాల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో టీబీ మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఈ వ్యాధి నివారించదగిందే కాకుండా, వ్యాధి సోకిన వారిని నయం చేసేందుకు చికిత్స అందుబాటులో ఉండటం గమనార్హం. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ప్రభుత్వాలు సకాలంలో వ్యాధిని గుర్తించే ఏర్పాట్లు చేయటమే తరువాయి. ఈ వ్యాధి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రోగి నుంచి ఇతరులకు సోకుతుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి ఇది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ చర్మము నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈవ్యాధి సోకే అవకాశం ఉంది.
ఎవరెవరికి వస్తుందంటే...
యాక్టివ్ టీబీ రోగులతో సన్నహితంగా ఉన్న వారికి, బలహీనమైన రోగనిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులు, ఆస్పత్రుల్లో పని చేసే వారు, టీబీ వ్యాధి రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. రోగి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్, హెచ్ఐవీ, క్యాన్సర్, అవయవమార్పిడి చేయించుకున్న రోగులు, స్టెరాయిడ్స్ అధికంగా వాడినవారు, కిడ్నీ సమస్యలు ముదిరిన వారు, పోషకాహారం లోపమున్న వారు, పొగాకు, డ్రగ్స్ ఉపయోగించే వారు మిగతా వారితో పోలిస్తే ఈ వ్యాధికి లోనయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 90 శాతం కేసుల్లో టీబీ ఊపిరితిత్తులనే ప్రభావితం చేస్తున్నప్పటికీ 15-20 క్రియాశీల కేసుల్లో చర్మం నుంచి మెదడు వరకు ఏ అవయవానికైనా వచ్చే అవకాశముంది.
వైద్యుడిని సంప్రదించాలి
జ్వరం, దీర్ఘకాలిక దగ్గు, రెండు వారాలకి మించి రాత్రి పూట చెమటలు పట్టడం, రక్తపు దగ్గు, బరువు తగ్గడం, శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, ఛాతి నొప్పి, బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. వీటితో పాటు అదనంగా మెడలో వాపులు, గడ్డలు, నిరంతర తలనొప్పి, మానసిక మార్పులు , పక్షవాతం, వెన్నెముక నొప్పి, మింగడంలో ఇబ్బంది, పొత్తికడుపు నొప్పి, మాల్ అబ్జార్ప్షన్, నయం కాని అల్సర్లు వంటి లక్షణాలు కూడా క్షయవ్యాధికి కారణంగా కనిపించవచ్చు.
పరీక్షలు చేయించుకోవాలి...డాక్టర్ రాజీవ్
టీబీ సోకినట్టుగా అనుమానం కలిగితే వెంటనే తెమడ తదితర పరీక్షలను చేయించుకోవాలని ప్రభుత్వ ఛాతివ్యాధుల ఆస్పత్రి, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వైద్యవిభాగం పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఎం.రాజీవ్ సూచించారు. ఒకవేళ వ్యాధి ఉన్నట్టుగా నిర్దారిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. వ్యాధి సోకినవారు తమ కుటుంబసభ్యులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు, పౌష్టికాహారం, నెలకు రూ.500 నగదు సహాయం అందిస్తున్నదని చెప్పారు. వ్యాధిగ్రస్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెండు పరీక్షలూ చేయించుకోవాలి.... డాక్టర్ సురేంద్ర
టీబీ, కోవిడ్-19 వ్యాధులు రెండు కూడా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయనీ, వీటిని గుర్తించడంలో అయోమయానికి గురి కావద్దని సిరిసిల్ల అమత హాస్పిటల్ డాక్టర్ జి.సురేంద్రబాబు సూచించారు. టీబీ బాక్టీరియాతో, కరోనా వైరస్‌తో వస్తాయనీ, అయితే లక్షణాలు ఒకేలా ఉంటాయని తెలిపారు. దగ్గు, జ్వరం, శ్వాత తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే రెండు వ్యాధుల నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. హెచ్ఐవీ లేని వ్యక్తితో పోలిస్తే ఆ వ్యాధి ఉన్న వ్యక్తికి టీబీ వచ్చే అవకాశం 20 నుంచి 40 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు సామాజిక అభద్రతలను అధిగమించి చికిత్స పొందేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.