Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీకి మానవ ధర్మం అక్కర్లేదు..
- మనుధర్మం కావాలి
- ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా కాలరాస్తోంది
- హామీలు ఇచ్చి గెలిచిన ఎంపీ ఏం చేస్తున్నారు :సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- ఆదిలాబాద్‌లో జన చైతన్య యాత్ర ప్రారంభం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి(మెడపట్ల సురేష్)
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దుష్ట పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ పీడను వదిలించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం మానవ ధర్మాన్ని చెబితే బీజేపీ మాత్రం మనుధర్మం అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని... కేంద్రంలోని కాషాయ ప్రభుత్వం దళితులు, గిరిజనులను బతకనీయడం లేదని తెలిపారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన రెండోదశ జనచైతన్యయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య నేతృత్వంలో ఈ జనచైతన్య యాత్ర జరుగుతోంది. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యాత్రను బీవీ రాఘవులు ప్రారంభించారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశాన్ని లూటీచేయడమే బీజేపీ పని
'బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతోంది. ఆ పార్టీ డబుల్ ఇంజన్ ఉండాలని చెబుతోంది. ఆదిలాబాద్‌లో ఆ పార్టీ ఎంపీని కూడా గెలిపించారు. కానీ ఆదిలాబాద్ జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. 2014లో ఓటువేసి గెలిపిస్తే అచ్చేదిన్ వస్తాయని మోడీ చెప్పారు. ప్రతి ఏడాది 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 16కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి కానీ ఇవేమీ జరగలేదు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగాలను తీసివేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నారు. ఇవేనా అచ్చేదిన్ అంటే' అని రాఘవులు ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో దాచుకున్న రూ.లక్షల కోట్లను తీసుకొచ్చి అందరికీ పంచుతామని, నేరుగా పేదల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. కానీ ఎక్కడా జమ అయిన దాఖలాలు లేవు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు స్విస్ బ్యాంకులకు వెళ్తున్నాయని తెలిపారు. అదాని దోచుకున్న డబ్బులన్ని అక్కడికే వెళ్తున్నాయని చెప్పారు. 1998లో మూతపడిన సీసీఐని ఇప్పటి వరకు తెరవలేదు. ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగమే కదా? ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. చుట్టుపక్కల 14లక్షల ఎకరాల్లో పత్తి పండుతుంది. ఇక్కడ కనీసం 10 పరిశ్రమలు పెట్టొచ్చు. అయినా వాటి గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీనిచ్చిన స్థానిక బీజేపీ ఎంపీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని లూటీ చేయడం, ప్రజలను మోసం చేయడమే మోడీ పనిగా పెట్టుకున్నారని విమర్శిం చారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.50కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు కానీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వేలైన్‌ను పట్టించుకోవడం లేదని, గిరిజన యూనివర్సిటీ పెట్టడం లేదన్నారు.
స్వేచ్ఛ లేకుండా పోయింది
మోడీ మన్‌కీబాత్ అంటున్నారు. కానీ ఎవరైనా మనసులో మాట చెప్పినా, ప్రశ్నించినా వారిపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి వారిని పంపిస్తున్నారని రాఘవులు అన్నారు. సిసొడియా, కవితతో పాటు ఎల్డీఎఫ్ మంత్రుల దగ్గరికి కూడా ఈ సంస్థలను పంపించారని గుర్తుచేశారు. బీజేపీ వాళ్ల జోలికి మాత్రం వెళ్లడం లేదని, వారి స్నేహితులకు ఒక రూలు, వేరే వారికి మరో రూలు ఉంటుందా అని ప్రశ్నించారు. ఆంధ్రాకు సీఐడీ, ఇన్‌కంట్యాక్స్ వారు కూడా వెళ్లడం లేదని తెలిపారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. మేధావులను జైళ్లలో పెడుతున్నారని అన్నారు. ప్రకృతికి మనుషులకు మధ్య తేడాలు లేవని, కానీ బీజేపీకి మాత్రం మనుషుల మధ్య తేడాలు ఉంటాయని చెప్పారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచి తన్నుకుచచ్చేలా చేస్తోందని, ఇలా ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ మత కలహాలు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా మిగతా అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని వదిలించుకోలేకపోతే చాలా ప్రమాదం మంచుకొస్తుందని, ప్రజలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. సీపీఐ(ఎం) సమానత్వం కోసం పోరాడుతుందని, రైతుకు గిట్టుబాటు ధర, అంగన్వాడీల క్రమబద్ధీకరణ ఇలా పేద వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తుందని తెలిపారు.
బడాబాబుల బొజ్జలు నింపుతోంది
బీజేపీ ప్రభుత్వం దేశంలో దుర్మార్గమైన, ప్రమా దకర పాలన సాగిస్తోందని పేదల మూలుగలను పీల్చీ బడాబాబుల బొజ్జలు నింపుతోందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ప్రజల అమాయకత్వం, వెనుకబాటుతనా న్ని ఆసరాగా చేసుకొని మోసం చేయడం నేర్చుకుం దని వివరించారు. మోడీ అంబానీ, ఆదానీల బొజ్జలు నింపే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోడు సమస్యలపై సీపీఐ(ఎం), వామపక్షాలు పోరాటం చేసినట్టు ఎవరూ చేయలేరని వ్యాఖ్యానిం చారు. ఇండ్ల స్థలాలు, కనీస వేతనాల పెంపు కోసం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో ఎర్రజెండా ముందు వరుసలో ఉందని తెలిపారు. బీజేపీ మహమ్మారి ప్రమాదాన్ని గుర్తించకపోతే ఆదిలాబాద్‌కే కాకుండా దేశానికి కూడా తీవ్రనష్టమని వ్యాఖ్యానించారు. గిరిజనుల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని అనేక ఏండ్లుగా పోరాడు తున్నా మోడీ పెంచేందుకు సిద్ధంగా లేరని, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను సవరించి దాని కోరలు పీకేసీ దళితు లు, గిరిజనులను వంచిస్తోందని తెలిపారు. ఆదిలా బాద్ అభివృద్ధి చెందుతుందని ఇక్కడ బీజేపీ ఎంపీని గెలిపించారని, కానీ సీసీఐని తుక్కు కింద అమ్ము తున్నారని మండిపడ్డారు. ఎంపీ సోయం ఏం చేస్తు న్నారని మండిపడ్డారు. సీసీఐ భూములను కొంత మంది కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు న్నారని తెలిపారు.
ఎంపీ సోయం బాపురావుకు సోయి ఉంటే గిరిజనులను మోసం చేసిన బీజేపీ పార్టీ అవసరం లేదని చెప్పాలని, ఆయన ఈ ప్రకటన చేస్తే పార్టీ తరుపున సన్మానం చేస్తామన్నారు. ఆదిలాబాద్‌లో 365 ఎకరాలు విమానాశ్రయం కోసం భూమి ఉందని, ఇక్కడ విమానాశ్రయం నిర్మించే బాధ్యత మోడీకి లేదా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ. నరసింహా రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, జయలక్ష్మీ, పి.ఆశయ్య, టి.స్కైలాన్బాబు, ఎం. ఆడివయ్య, ఎల్.బాలకృష్ణ, జగదీష్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య