Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అకాల వర్షాలు, వడగండ్లు, పిడుగుల వల్ల పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో రూ.1250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా ప్రకటించిందన్నారు. కానీ వాస్తవం ఇందుకు రెట్టింపుగా ఉంటుందని తెలిపారు. 25 జిల్లాల్లో దాదాపు 7 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లిందని తెలిపారు. పసుపు, మిరప, జొన్న, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. పండ్ల తోటలలో పుచ్చ, కర్బూజా, మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పిడుగుల వల్ల గొర్రెలు, మేకలు, ఎద్దులు, కోల్లు మృత్యువాతపడ్డాయన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న విస్తీర్ణంలో 30 శాతం నష్టం జరిగినప్పటికీ 43,424 మందికి చెందిన 57,855 ఎకరాలు మాత్రమే నష్టం జరిగినట్టు అధికారులు ప్రకటించడం బాధాకరమన్నారు. వాస్తవ గణాంకాలు సేకరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇదే సంవత్సరం వానాకాలంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. అందులో ఏడు లక్షల ఎకరాల్లో పత్తి పంట ఉందన్నారు. 15 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయించిన రూ.629 కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 2023 మార్చి 14న రూ.1816 కోట్లు విడుదల చేసిందన్నారు. కానీ అందులో తెలంగాణకు రూపాయి కూడా సహాయం ఇవ్వలేదని తెలిపారు. 2022-23లో వానాకాలం, యాసంగి కలిపి నాలుగు వేల కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందని ఆ వినతి పత్రంలో కోరారు. ప్రధానంగా కౌలు రైతుల తీవ్రంగా నష్టపోయారని, నేరుగా కౌలు రైతులకే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రకృతి వైపరిత్యంగా పరిగణించి తక్షణ సహాయం కింద రాష్ట్రానికి రెండు వేల కోట్లు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. నష్టపోయిన ఇండ్లు, పశువులకు కూడా పరిహారం చెల్లించాలన్నారు.
పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఐ వినతి
రైతులకు లక్ష రూపాయల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎం కేసీఆర్‌కి వినతిపత్రం అందజేశారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి మొక్కజొన్నకు రూ.50,000, ఇతర పంటలకు రూ.30,000 చొప్పున పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. కౌలు రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసే విధానంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను, ఈసీ ఏఎన్ఎంలను భేషరతుగా రెగ్యులేషన్ చేయాలని విన్నవించారు.