Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్ష చేశారు. గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఏన్సీ గణపతిరెడ్డి, సీఈ సతీష్, డిసీ రోడ్స్ దివాకర్, ఎస్ఈ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పీరియాడికల్ రెన్యూవల్ రోడ్ల మరమ్మతుల పనుల పురోగతిపై చర్చించారు. ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతీవారం తానే స్వయంగా రోడ్ల పనుల ప్రగతిని పరిశీలిస్తానని మంత్రి అధికారులతో అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పలు వంతెనలు ,ఆర్వోబీలు,ఆర్యూబీల విషయమైకూడా పనుల పురోగతిపై సీఈ సతీష్‌తో చర్చించారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ తీరాన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమర వీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డితో మాట్లాడారు. ప్రారంభ తేదీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో తుదిదశ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.