Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాలిన వరి కంకులు, మామిడి కాయలతో నిరసన
నవతెలంగాణ - ములుగు
వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం రాలిపోయిన వరి కంకులు, మామిడికాయలతో ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గోవిందరావుపేట మండలం కర్లపెల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలోని 300 ఎకరాల వరి పైరు వడగండ్ల వానకు దెబ్బతిన్నదని తెలిపారు. మామిడి చెట్లు మొత్తం కూలిపోయాయని, తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో నామమాత్రంగా సర్వే నిర్వహించారని, ఈసారన్నా ప్రతి రైతు పొలం తిరిగి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కర్లపల్లి ఉమ్మడి పంచాయతీలో నష్టపోయిన పొలాలను సర్వే చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రైతులను ఆదుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ పాషా, రత్నం రాజేందర్, తీగల ఆదిరెడ్డి, సామ చంద్రారెడ్డి, ఎండి అమ్జద్ పాషా, భూక్య మిట్టు నాయక్, పాల్త్య బాలు, మూడు రాజు నాయక్, భాస్కర్ నాయక్, మల్లేష్, రైతులు పాల్గొన్నారు.