Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్గావ్లో అదుపులోకి తీసుకున్న అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆయుర్వేద ఔషధాల సరఫరా పేరిట రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులను మోసం చేసి రూ.1.60 కోట్లు నొక్కేసిన సైబర్ నేరగాడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రం గుర్గావ్కు చెందిన రంజిత్ తివారీ 2019లో తాను ప్రముఖ ఆయుర్వేదిక్ మందుల తయారీ కంపెనీ యజమానిగా పేర్కొంటూ ఆన్లైన్ ప్రకటనలు ఇచ్చాడు. మెటాసిస్ ఆయుర్వేదిక్ కంపెనీ పేరిట తాను వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంటూ కొన్ని ఔషధాలకు సంబంధించిన చక్కటి రంగు రంగుల కరపత్రాలను కూడా ఆన్లైన్లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసి విశ్వసించిన హైదరాబాద్‌కు చెందిన సింధూర ఎంటర్ప్రైజెస్ యజమాని రంజిత్ తివారిని సంప్రదించాడు. ఆ మేరకు అతని ఆయుర్వేదిక్ మందుల డీలర్షిప్ తీసుకుంటానని చెప్పి మొదట రూ. 6 లక్షలను రంజిత్ తివారికి పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత ఔషధాల సరఫరా కోసమని మరో రూ. 36 లక్షలను రంజిత్ తివారీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది జరిగిన తర్వాత రంజిత్ తివారీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఆయన ఆన్లైన్ వెబ్సైట్ కూడా మూత పడింది.
దీంతో లబోదిబోమంటూ సింధూర ఎంటర్ప్రైజెస్ యజమాని రాష్ట్ర సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి రంజిత్ తివారీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన సీఐడీ అధికారులు దాదాపు నాలుగేండ్ల తర్వాత గురువారం గుర్గావ్లో ఎట్టకేలకు ఆయనను పట్టుకున్నారు. అతనిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి సీఐడీ అధికారులు ఇక్కడ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. విచారణలో రంజిత్ తివారీకి అతని సరఫరా చేసే ఔషధాల కోసమని మరో ముగ్గురు వ్యక్తులు కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోయారని తేలింది. మొత్తమ్మీద హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులకు ఈ మోసగాడు రూ.1.60 కోట్ల మేర కుచ్చుటోపీ తొడిగినట్టు తేలింది. కాగా, నిందితుడు రంజిత్ తివారీని అరెస్టు చేసిన సీఐడీ ఎస్సై సత్యపాల్ సింగ్, అతని బృందాన్ని ఆ విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్ అభినందించారు.