Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేనిపక్షంలో రైతులకు భూములు అప్పగించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మూతపడిన సీసీఐ పరిశ్రమను కేంద్ర ప్రభు త్వం వెంటనే పున:ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల నుంచి సేకరించిన భూములను వారికే అప్పగించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని సీసీఐ పరిశ్రమను గురువారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. చుట్టుపక్కల పరిసరాల్లో పర్యటించి పరికరాలు, భారీ యంత్రాలను పరిశీలించారు. అనంతరం భూనిర్వాసితులతో మాట్లాడి వారి సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ మూతపడటంతో భూములు కోల్పోయిన రైతులతో పాటు ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని, కొంత మంది ఈ భూములను లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బాగా నడిచే ప్లాంటును మూసివేసి ఆదిలా బాద్ జిల్లాను ఇంకా వెనుకబాటుకు గురిచేసిందని తెలిపారు. ఈ పరిశ్రమ తుక్కుగా మారలేదని.. తక్కును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 700 ఎకరాలను కబ్జా చేసేందుకు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల్లా చూస్తున్నారన్నారు. రూ.1500 కోట్ల ఆస్తిని కేవలం రూ.150కోట్లకు కట్టబెట్టేలా కుట్ర జరుగుతోందని తెలిపారు. ఇందులో కొందరు పెద్దల హస్తం ఉందని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే ఈ పరిశ్రమను తెరిపిస్తామని ఎంపీ సోయం బాపురావు హామీ ఇచ్చారని, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో విఫల మయ్యారని విమర్శిం చారు. వాగ్దానాలు చేయడం వాటిని మర్చిపోవడం మోడీకి అలవాటేనన్నారు. బీజేపీ నాయకులు మోస గాళ్లకు మోసగాళ్లలా తయారయ్యారని విమర్శిం చారు. భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా ఉంటామని, వారి తరపున న్యాయ పోరాటం చేస్తా మని చెప్పారు. ఆయన వెంట పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, భూనిర్వాసితులు అరవింద్, ఈశ్వర్, విఠల్ తదితరులున్నారు.