Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురుల నిజమైన నివాళి అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురు 92వ వర్ధంతిని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు, మతోన్మాద శక్తుల మైత్రి బంధంతో కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్నదని చెప్పారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లు ప్రాణత్యాగం చేసింది ఇలాంటి దేశ నిర్మాణం కోసం కాదన్నారు. వారి ఆశలు, ఆశయాలు, ఆలోచనలు దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం, ఆ కర్తవ్యం మిగిలే ఉందని అన్నారు. భగత్ సింగ్ వారసులుగా మనం అందుకు పూనుకోవాలని పిలుపు నిచ్చారు. లక్ష్య సాధనకు తనను తాను దహించుకొని వెలుగు పంచడానికి కొవ్వొత్తిలా కరిగే కార్యకర్తలం కావాలని అన్నారు. ఉద్యమాలను, పోరాటాలను ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా భుజాలపై మోయగల పునాది రాళ్ళం కావాలని అన్నారు. అదే నేటి అవసరం, అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు సరైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ ఆంజనేయులు, డి వెంకటేష్, రైతు సంఘం నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.