Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి...మతానికి సంబంధమేంటి?
- కులం, మతం పేరుతో ప్రజల్ని చీల్చడం అభివృద్ధా..?
- వ్యవసాయంపై అంబానీ, అదానీ కన్ను
- అందులోభాగమే మూడు నల్లచట్టాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్
చింతకాని నుంచి అచ్చిన ప్రశాంత్
కార్పొరేట్, కమ్యూనలిజాల(మతతత్వం)తో ముందుకెళ్తున్న బీజేపీ తీరు వల్ల దేశానికే పెను ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ హెచ్చరించారు. పరిపాలనలో మతం ప్రమేయం ఏంటి? అసలు ప్రభుత్వానికి, మతానికి సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కులం, మతం పేరుతో ప్రజల్ని చీల్చడం అభివృద్ధి ఎలా అవుతుంది? అని నిలదీశారు. మతపాలనతో ముందుకెళ్లిన పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్, ఇరాన్ జరుగుతున్న పరి ణామాలతోనైనా బుద్ధి తెచ్చుకుని సక్రమ మార్గంలో నడవాలని బీజేపీకి సూచించారు. సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విద్యా,వైద్య, పారిశ్రామిక రంగాలన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతున్న వైనం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును వివరిస్తూ చేప కథను చెప్పారు. భవిష్యత్తును శాసించే వ్యవసాయ రంగంపై అంబానీ, అదానీ కన్ను పడిందన్నారు. వారికి సేవ చేయడంలో భాగంగానే మోడీ సర్కారు మూడు వ్యవసాయక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లుతో వ్యవసాయానికి అందుతున్న ఉచిత కరెంటు, పేదలకు అందుతున్న సబ్సిడీలన్నీ రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికకోడ్లు తెచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చుతున్న తీరును వివరించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. చట్టసభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా, లేకపోయినా రైతులు, కార్మికులు, ప్రజల పక్షాన నికరంగా పోరాడేది ఎర్రజెండాలేనని నొక్కి చెప్పారు. కేరళ ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే గుజరాత్లో కేవలం ఆరువేల పోస్టులనే వేశారని వివరించారు. సామాజిక న్యాయంలో భాగంగా కేరళలో దళితుల్ని పూజారులుగా నియమిస్తుంటే మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అణచివేత తీవ్రమవుతున్నదన్నారు. కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం పేదలకు రూ.7.40 లక్షలిచ్చి సొంతింటిని కట్టిస్తున్నదని చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకెళ్తున్న కేరళ మోడల్ ఇప్పుడు దేశానికి అవసరమని నొక్కిచెప్పారు. ప్రజలంతా ఈ అంశాలన్ని గ్రహించి మతం, కులం పేరుతో వచ్చి ఓట్లడిగే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాచైతన్య యాత్ర నాయకుడు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రిప్రసాద్, పొన్నం వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, నాయకులు బుగ్గవీటి సరళ, బత్తుల హైమావతి, సాధినేని రామారావు, మాదినేని రమేశ్, మాచర్ల భారతి, బండి పద్మ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.