Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రం
- రేవంత్ రెడ్డి, బండి సంజరులకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు.. ప్రభుత్వం వేరు అనే ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులు
- వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం
- రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దు
- ప్రిపరేషన్‌ను కొనసాగించాలంటూ యువతకు మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజరులకు మంత్రి కే.తారకరామారావు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలు పన్నుతున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందనే కనీస అవగాహన కూడా లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందనీ, అయితే ఈ వాస్తవాలన్నింటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజరు, రేవంత్‌లు తెర లేపారని విమర్శించారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహా రాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివి తక్కు వతనంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ తెలిపారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూ రితంగా, రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నారని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని హెచ్చరించారు. ఇప్పటికే తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో రేవంత్, సంజరు ప్రజల్లో చులకనయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సందర్భంగా రూ.పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందనీ, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారంటూ తిక్క తిక్క వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజరు చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనించారని తెలిపారు. ఇప్పటికే వీరిద్దరూ మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయం కరమైన కుతంత్రం దాగి ఉందని మంత్రి ఈ సంద ర్భంగా హెచ్చరించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వటాన్నే ఒక కుట్రగా అభివర్ణిం చారనీ, ఈ అంశంపై చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు, వారి కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు.
సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి, యువత ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శవాల పైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా వ్యవహరించటాన్ని కాంగ్రెస్, బీజేపీ మానుకోవాలని హితవు పలికారు.
ప్రిపరేషన్ ఆపొద్దు..
తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్ పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభిం చిందనీ, భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్ష లను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధ మవుతుందని ఆయన తెలిపారు. కేవలం రాజకీ యాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్ర లను, ప్రచారాన్ని నమ్మొద్దని యువతను కోరారు.