Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిగ్రామంలో పోరాటం మొదలవ్వాలి
- లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేస్తాం
- ప్రజావ్యతిరేక మోడీని గద్దెదించాలి
- కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నూతన చరిత్రను లిఖించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్
- ఘనంగా నిజామాబాద్‌లో జనచైతన్య యాత్ర ప్రారంభం
- భారీ బైక్ ర్యాలీ..ఆకట్టుకున్న కళారూపాలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి( భాస్కర్)
మతఛాందసవాద శక్తులు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, ఆ శక్తులు అధికారంలోకి రాకుండా నిలువరించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ పిలుపునిచ్చారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఈ గడ్డకు ఉందని, అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య వ్యతిరేక, మతోన్మాద బీజేపీని ఓడించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నూతన చరిత్రను లిఖించాలని పిలుపునిచ్చారు. బీజేపీని గద్దెదించడంలో అందరం ఐక్యంగా ముందుకు సాగాలని, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దామని అన్నారు.
సీపీఐ(ఎం) మూడో జనచైతన్య యాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యింది. సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ నేతృత్వంలో హైదరాబాద్ వరకు ఈ జాతా సాగుతుంది. యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని విమర్శించారు. యావత్ ప్రపంచంలో అత్యంత పేదరికం, నిరుద్యోగం భారతదేశంలోనే ఉందని వివరించారు. ఈ పేదల అభ్యున్నతికి, మోడీ సర్కారు వద్ద ఎలాంటి కార్యక్రమాలు లేవన్నారు. పేదలు తినే బియ్యంపై, ఉప్పుపై పన్నులు వేసిన ఘనుడు మోడీ అని మండిపడ్డారు. బ్రిటిష్ పాలనలో ఉప్పుపై పన్ను వేస్తే నాడు మహాత్మాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు పోరాటం చేశారని, మళ్లీ మోడీ సర్కారు బ్రిటీష్ పాలనను తలపిస్తోందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీచట్టంలో భాగంగా 100 రోజులు పని కల్పించాల్సి ఉండగా.. కేవలం 20 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, పని దినాలను తగ్గించారని అన్నారు.
దేశంలో దేశ సమైక్యతను కాపాడే సర్కారు లేదని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విభజించే సర్కారు ఉందని విమర్శించారు. కేంద్ర సర్కార్ బాధితుల పక్షాన ఉండకుండా దాడులు చేసే వారికి మద్దతుగా నిలుస్తోందని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ అనుకూల గవర్నర్లను నియమించి రాష్ట్ర పాలనలో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలపై సంతకాలు చేయాల్సి ఉండగా.. ఆ బిల్లులను తొక్కి పెడుతున్నారని విమర్శించారు. కేరళలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే కేరళలో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడం లేదని అన్నారు. కేరళలోని వామపక్ష సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పేదల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పింఛను రూ.3200 ఇస్తున్నామని, పేదలకు 20 కిలోల బియ్యం, కూరగాయలు ఇస్తున్నామని తెలిపారు. వామపక్ష సర్కారు.. పది లక్షలు వెచ్చించి డబుల్ బెడ్రూం ఇండ్లు సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నదని వివరించారు. కానీ బీజేపీ సర్కారు ఇందుకు విరుద్ధంగా పేదలను గాలికొదిలి, కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు ఎర్రతివాచి పరుస్తోందని విమర్శించారు. పేదలను విస్మరించి, అసమానతలు పెంచే సర్కారును మార్చాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. బీజేపీ సర్కారును నిలువరించాలంటే పోరాటమార్గం ఎంచు కోవాలన్నారు. బీజేపీ రాజకీయ విధానాలపై, మతోన్మాద చర్యలపై ప్రతి గ్రామంలో ప్రజలు సంఘటితమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నగరంలో బైక్ ర్యాలీ జరిగింది. కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. పాటల సీడీని విజయరాఘవన్ ఆవిష్కరించారు.
నిజామాబాద్ నుంచి కామారెడ్డి వరకు ర్యాలీ
నిజామాబాద్ నుంచి బైక్ ర్యాలీతో పాటు సాగిన యాత్రకు కామారెడ్డి జిల్లా పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ స్వాగతం పలికింది. పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్.. యాత్రీకులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో ఎస్. రమ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మెతిరాం నాయక్, చంద్రశేఖర్, కొత్త నర్సింలు, రాజనర్సు, ఎస్ఎఫ్ఐ అరుణ్, తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
బీజేపీ యత్నాలను తిప్పికొడతాం
రాష్ట్ర నాయకులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు హిందూత్వ అజెండాతో బీసీ, ఎస్సీ, ఎస్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా ఆంక్షలు విధించేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యాంగం మారుస్తామని కారుకూతలు కూస్తున్నాడని, ఇలాంటి వ్యక్తిని ఈ సారి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, డిపాజిట్ కూడా దక్కనీయొద్దని సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ రాసిచ్చి, మాట మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం), వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలిసి బీజేపీయత్నాలను తిప్పికొడతామని అన్నారు. దేశంలో ఒకే ట్యాక్స్, ఒకే యాక్ట్ ఉండాలంటున్న కేంద్రం.. మరి ఒకే కులం ఉండాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అని, ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ప్రజా సమస్యలు విస్మరిస్తే నడిరోడ్డుపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
సీసీఐ నిర్వీర్యంతో పత్తికి ధరలేదు : సాగర్
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. ఓ వైపు ధరలు పెంచుతున్న సర్కారు.. అందుకు తగ్గట్టు వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడం లేదన్నారు. సీసీఐని నిర్వీర్యం చేశారని, ఫలితంగా మార్కెట్లో పత్తికి ధర లేక మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బీజేపీది బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డుతో పాటు చెరుకు ఫ్యాక్టరీ గురించి కూడా హామీనిచ్చారని గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీ తెరవకపోతే తానే ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితను మూడు సార్లు ఈడీ ప్రశ్నించిందని, తప్పుడు షేర్ల విలువలతో 17 లక్షల కోట్లు ఆవిరి చేసిన అదానీని ఈడీ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర కార్యదర్శి రమ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 33 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తామని హామీనిచ్చిన మోడీ సర్కారు.. అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినా అమలు చేయడం లేదని అన్నారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్నా 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీడీ రంగాన్ని మొత్తంగా నాశనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, రాష్ట్ర నాయకులు రమణ, పెద్ది వెంకట్రాములు, అరుణజ్యోతి, నూర్జహాన్, రమేష్‌బాబు, సబ్బని లత, వెంకటేష్, శంకర్‌గౌడ్, గోవర్ధన్, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.