Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మార్పు చేయాలి
- విద్యుత్ కార్మికుల మహాధర్నాలో నేతల డిమాండ్
- జనసంద్రమైన విద్యుత్ సౌధ
- భారీగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణ తక్షణం చేపట్టాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో జరిగిన 'మహాధర్నా' డిమాండ్ చేసింది. జేఏసీ పిలుపులో భాగంగా వేలాదిమంది విద్యుత్ ఉద్యోగులు చలో హైదరాబాద్ పేరుతో విద్యుత్ సౌధ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు తరలిరావడంతో ఖైరతాబాద్ ప్రాంతం జనసంద్రంగా మారింది. విద్యుత్ సౌధ ఎదుటి రోడ్లు కిక్కిరిసిపోయాయి. తమ డిమాండ్లను వెల్లడిస్తూ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో ప్రమోషన్లను రివర్షన్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2022 ఏప్రిల్ 1 నుంచి తమకు నూతన వేతన సవరణ రావల్సి ఉందనీ, ఇప్పటి వరకు దాన్ని ప్రకటించలేదన్నారు. భారీగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులతో రోడ్లు నిండిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాలుగా నిలిచింది. డీజీపీ అంజన్‌కుమార్ విద్యుత్ సౌధ చుట్టుపక్కల ఏరియల్ సర్వే చేశారు. మహాధర్నాలో జేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకరరావు, కో చైర్మెన్ ఎన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గోవర్థన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వరరావు, పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం, 1104 యూనియన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సహా మొత్తం 24 సంఘాల నాయకులు మాట్లాడారు. 1999 నుంచి 2004 వరకు నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్, జీపీఎఫ్ అమలు చెయ్యాలని కోరారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం, విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో జరిపిన చర్యలు కొలిక్కి రాలేదన్నారు. ఇంకా సమయం కావాలని అడుగుతున్నారనీ, ఇప్పటికే తాము ఏడాది వేచి చూశామని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఆర్టిజన్ కార్మికులకు నగదు రహిత అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చెయ్యాలనీ, కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత వైద్య సదుపాయాలు కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు ఇవ్వాలని కోరారు. భారీ ఎత్తున జరిగిన మహాధర్నాలో జేఏసీ వైస్ చైర్మెన్లు అనీల్, వజీర్, జాయింట్ సెక్రటరీలు శ్యామ్ మనోహర్, వెంకన్న గౌడ్, సుధాకర్ రెడ్డి, తులసి నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రాంజీ, నెహ్రూ, లోహిత్ ఆనంద్, నాగరాజు , సత్యనారాయణ రావు, మురళి, మోజెస్, గిరిధర్, శ్రీనివాస్, ఖాజా మొయినుద్దీన్, సతీష్ కుమార్, అరవింద్ కుమార్, రవీందర్, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సత్వరం పరిష్కరించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.