Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊసేలేని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక ప్రాజెక్టులు
- రైల్వే లైన్లకు దక్కని ప్రాధాన్యం
- రైలుకూతకు నోచని ఆరు నియోజకవర్గాలు
నవతెలంగాణ-సూర్యాపేట
కొత్త రైల్వే లైన్లు.. ప్రతిపాదిత లైన్లపైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. ప్రతి బడ్జెట్లోనూ నిరాశే మిగుల్చుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ప్రజలు పోరాడుతున్నా పాలకులు రైల్వే ప్రాజెక్టుల గురించి మాటైనా మాట్లాడటం లేదు. ఆమోదం పొందిన ప్రాజెక్టులకూ నిధులు కేటాయించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీనిపై పార్లమెంట్లో ఎంపీలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఉన్న ఎన్‌హెచ్ 65 వెంట రైల్వే లైన్ నిర్మిస్తే ప్రజా, సరుకు రవాణాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 93, షెడ్యూల్ 13లో చెప్పిన ప్రకారం తెలంగాణ- ఏపీ మధ్య ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం ప్రారంభించి 2024వరకు పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ప్రారంభమే కాలేదు. సూర్యాపేట మీదుగా హైదరాబాద్-విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు కనెక్టివిటీ కల్పించాల్సి ఉంది. జాతీయ రహదారి 65 వెంబడి సేకరించిన భూమిని ఉపయోగించుకొని ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలు మార్గం నిర్మించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీలు పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో డిమాండ్ చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. ఉమ్మడి జిల్లాలో కీలక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండగా.. ప్రతి సంవత్సరం వీటిపై జిల్లా ప్రజలు తమ డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు.
నల్లగొండ జిల్లా మీదుగా ఐదు దశాబ్దాల కిందట నిర్మించిన బీబీనగర్ - నడికుడి రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలని ఏండ్లుగా డిమాండ్ ఉంది. దీనికి 2019-20లో కేంద్ర ఆమోదించినా నిధుల కేటాయింపు జరపడం లేదు. మొత్తం 248 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గంలో రూ. 2480 కోట్ల అంచ నాతో డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలి పింది. అయితే, దీనిని పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపు అరకొరగానే ఉన్నది. ఈసారి బడ్జెట్లో రూ.60 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ లైన్లో డబ్లింగ్ పూర్తైతే మరిన్ని రైళ్ల రాకపోకలతో పాటు సమయం ఆదా కానుంది. అదేవిధంగా ఇదే రూట్లో 285 కిలోమీటర్ల పొడవైన పగిడిమర్రి, నల్లపాడు మధ్య విద్యుద్ధీకరణ పనులకు రూ.32.8 కోట్లు కేటాయిస్తున్నట్టు ఇటీవల బడ్జెట్లో వెల్లడించారు. ఇది కూడా నామమాత్రమే.
హైస్పీడ్ రైల్వే నిర్మాణం ఊసేది?
సికింద్రాబాద్- విజయవాడ మార్గంలో 256 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఉంది. అయినా దీని ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్- కాజీపేట రూట్లో ఉన్న డబుల్ లైన్‌కు అదనంగా మరో లైన్ చర్లపల్లి నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రస్తావనకు నోచు కోలేదు. కృష్ణా నది వెంట ఉన్న సిమెంట్ పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన మోట మర్రి- విష్ణుపురం 90 కిలోమీటర్ల పొడవునా సింగిల్ లైన్ మాత్రమే ఉంది. దీనిని డబుల్ లైన్‌గా మార్చాల్సి ఉంది. రెండేండ్ల కిందట కేంద్రం ఆమోదం తెలిపినా ఆచరణకు నోచు కోలేదు. ఈ లైన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఉపయోగ పడుతుంది. 1997- 98లో స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్‌గా మంజూరై మూడుసార్లు సర్వే జరిగినా నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ పనుల ప్రస్తావన నేటికీ నోచుకోలేదు. ఐదారేండ్ల కిందట 170 కిలోమీటర్ల సూర్యాపేట-స్టేషనఘన్పూర్ లైన్ సర్వే నిమిత్తం రూ.25.45 లక్షలు కేటాయించిన కేంద్రం తర్వాత పట్టించుకోలేదు. అదేవిధంగా గుంటూర్ డివిజన్ పరిధిలో ఉన్న మిర్యాలగూడ, నల్లగొండ, విష్ణుపురం, చిట్యాల రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. కాగా బియ్యం, సిమెంటు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతితో ఏటా సుమారు రూ.250 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నట్టు అంచనా. కానీ, నేటికీ సింగిల్ లైన్ ఉండటం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు రైళ్ల రాకపోకలకు ఆలస్యం అవుతోంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక్క కీలక ప్రాజెక్టునూ ప్రస్తావించలేదు.
హైదరాబాద్ నుంచి విజయవాడకి సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్ రైలు మంజూరు చేయాలని జిల్లా ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించారు. అయినా కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండి చెయ్యే చూపారు. పోచంపల్లి ఐఐహెచ్‌టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డిమాండ్లను పట్టించుకున్న పాపానపోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు రైలు కూతకు నోచుకోలేదు.
జిల్లాకు రైల్వే లైన్ సౌకర్యం కల్పించాలి
జిల్లాకు రైల్వే లైన్ సదుపాయం కలిపిస్తే వ్యాపార, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి కలుపుతూ సూర్యాపేట, కోదాడ మీదుగా రైల్వేలైను మంజూరు చేయాలి. దీని వల్ల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమవుతుంది. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. జిల్లాకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల గురించి ఇటీవలి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణం.
- సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జున రెడ్డి
బడ్జెట్లో మొండిచెయ్యి
రైల్వేశాఖ పరంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. బీబీనగర్ - గుంటూరు లైన్ డబ్లింగ్‌కు మరోసారి మొండిచెయ్యి చూపింది. జిల్లా ప్రాజెక్టుల విషయంలో అనేకసార్లు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. జిల్లాలోని కీలకమైన రాయగిరి ఎంఎంటీఎస్ పొడిగింపు, బీబీనగర్- నడికుడి డబ్లింగ్ పనులు, సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో మూడోలైన్ నిర్మాణం, రెండు రాజధానుల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ వంటి కీలకమైన వాటిని కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో వీటి గురించి ప్రస్తావించాం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
- రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్