Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవలు ఏరియాస్పత్రి తరహా..
- 2019లో ప్రారంభమైనా అమల్లోకి రాని పూర్తి స్థాయి సేవలు
- ఏరియా ఆస్పత్రిలో విద్యార్థుల ప్రాక్టికల్ బోధన
- సమకూరని యంత్ర పరికరాలు
ఎయిమ్స్.. దేశంలోనే పేరుగాంచింది.. అలాంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ పేరుకే ఎయిమ్స్.. అక్కడ ఎలాంటి సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. 2019లో నామమాత్రంగా ప్రారంభించినా.. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. విద్యాబోధనా సక్రమంగా అందడం లేదు. యంత్ర పరికరాలూ సమకూర్చలేదు. అనుకున్న లక్ష్యం చేరుకోలేదు. ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు ఎయిమ్స్ వైద్యంపై పెట్టుకున్న ఆశలు అడియాశలైనాయి. అత్యాధునిక అత్యుత్తమ వైద్య సేవలు అందాల్సిన ఎయిమ్స్‌లో ఏరియా ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. 2019లో ప్రారంభమై.. 2020 నుంచి ఓపీ సేవలు అందిస్తున్నా నేటికీ వైద్యం సేవలు ఇన్ పేషెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఎయిమ్స్ వరకు రైలు సదుపాయం కల్పించాలని డిమాండ్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అందులో చదివే వైద్య విద్యార్థులకు విద్యాబోధన ప్రాక్టీస్ కోసం పేషెంట్లు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భువనగిరి వైద్యశాలలో వైద్య విద్య నేర్చుకోవడానికి అనుమతిచ్చింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లోనూ ఎయిమ్స్‌కు నామమాత్రంగానే నిధుల కేటాయింపు జరిగింది.
నవతెలంగాణ - భువనగిరి
2014లో ఎయిమ్స్ గురించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వా నికి హామీ ఇచ్చింది. జనవరి 2017లో నిమ్స్ క్యాంపస్‌ను ఎయిమ్స్‌గా స్థాపించడానికి కేంద్రానికి నివేదికలు పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో భువనగిరిలో ఎయిమ్స్ ప్రారంభించాలనుకున్నా వసతులు లేకపోవడం తో.. జిల్లాలోని నిమ్స్ వైద్యశాలలోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయడానికి 2018లో కేంద్ర ప్రభుత్వం సూత్ర పాయంగా ఆమోదం తెలిపింది. బీబీనగర్ క్యాంపస్‌లో 49 ఎకరాలు అదనంగా ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరింది. అదనపు భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసింది. జులై 3న యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. 17 డిసెంబర్ 2018న రూ. వెయ్యి 28 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందిం చారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిం చింది. 2019 మేలో బీబీనగర్‌లో 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్‌ను ప్రారంభించింది. ఆగస్టు 2019లో చేరిన విద్యార్థుల కోసం ఎయిమ్స్‌లో సేవలు లేకపోవడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రిని వైద్య విద్యార్థుల కోసం కేటాయించారు. 2020లో ఇన్ పేషెంట్ ప్రారంభిస్తామని చెప్పినా నేటికీ పూర్తిస్థాయిలో ఇన్ పేషెంట్ సేవలు అందడం లేదు. ఆధునిక యంత్ర పరికరా లు పరిమితంగా ఉండటం, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. దీంతో శస్త్ర చికిత్సలు నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఎయిమ్స్‌లో పర్యటనలకే పరిమితం అవుతున్నారు తప్ప నిధులు తేవడం లేదు..
హెల్త్ హబ్ పై వెనుకడుగు వేసిన రాష్ట్రం
ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా నిర్మించాలనుకుంది. అందులో భాగంగా హెల్త్ హబ్ తయారవుతుందని ప్రజలు ఆశిం చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు నిధులు కేటాయిం చడం.. నాలుగేండ్లవుతున్నా వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లలేక పోతుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో, బోధన సిబ్బంది నియామకంలో నిర్లక్ష్యం అడుగడుగునా కనబడుతోంది.
అందని ద్రాక్షలా ఎయిమ్స్ సేవలు
ఎయిమ్స్ ఉన్నది పేరుకే తప్ప సేవలు చెప్పుకొనే విధంగా లేవు. ఉమ్మడి ఐదు జిల్లాలకు అత్యాధునిక పరి జ్ఞానంతో అందాల్సిన వైద్యం అందని ద్రాక్షలా మారింది. శస్త్ర చికిత్స లు నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. వైద్య పరికరాలు వెంటనే కొనుగోలు చేసి శస్త్ర చికిత్సలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ ఎయిమ్స్‌పై వివక్ష ఉంది. ఓపీకి రోగులు వస్తున్నా సరైన యంత్రాలు లేవు. వైద్య నమోదు కేంద్రాలు లేకపోవడం, సమయం తక్కువగా ఉండటంతో రోగులు తిరిగి వెళ్లి పో తున్నారు. నియామకాలలో ఇతర రాష్ట్రాల వ్యక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత స్థానిక నిరుద్యోగు లకు ఇవ్వడం లేదు. దూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్‌లో వైద్య సేవల కోసం వచ్చే వారి కోసం బీబీనగర్ రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలి. ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైలును అందుబాటులోకి తేవాలి. జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయాలి.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్