Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి సాధించుకున్న పథకాలకు కేంద్రం మంగళం: వెబినార్‌లో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకే టెక్స్టైల్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని పూర్వ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినరుకుమార్ సమన్వయంతో' తెలంగాణ టెక్స్టైల్ పార్కు ప్రధాని ప్రకటన నేపథ్యం- ప్రయోజం' అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన పథకాలను బీజేపీ సర్కార్ రద్దు చేస్తున్నదని చెప్పారు. నేషనల్ హండ్లూం బోర్డు,నేషనల్ టెక్స్టైల్ బోర్డు తదితర సంస్థలు, స్కీములను రద్దుచేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేదోళ్లకు ఉపయోగపడే పథకాలను రద్ధు చేసి, కార్పొరేట్లకు లాభాలు తెచ్చి పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా..టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు కేంద్రం మద్దతుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో 11 టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అయితే అందులో కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయని వివరించారు. మౌలిక వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం జరుగుతున్నదని చెప్పారు. ఇవి సద్వినియోగంలోకి రావాలంటే..కేంద్రం కూడా సహకరించాలని సూచించారు. వరంగల్‌లోని అజాంజాహీమిల్ ఎప్పుడో మూతపడిందన్నారు.
ఐదువేల మంది కార్మికుల బతుకులు బజారుపాలయ్యాయని వాపోయారు. బీజీపీ యేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు కేంద్రం సహకరించటం లేదన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్రం ఏ మాత్రం సహకరించలేదని విమర్శించారు.
వీటిని పట్టించుకోకపోవటానికి ఒకే ఒక కారణం పెద్దపెద్ద బట్టల మిలుల ప్రయోజనాలు కాపాడటమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు కూడా సిరిసిల్లకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి స్కీములను ఎందుకు అమలు చేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ స్కీములను ప్రవేశ పెట్టేటప్పుడు ఆయా రంగాల నిపుణులతో, సంఘాలతో చర్చించాలని సూచించారు.తెలంగాణ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్‌కు తలొగ్గి కేంద్రం ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవటం మంచిదేనన్నారు.