Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోడీ ప్రభుత్వ ఫాసిస్టు, నిరంకుశ చర్యకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నయా హిట్లర్‌లా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్షాలను చూస్తే ఆయన వణికిపోతున్నారని పేర్కొన్నారు. అదానీ కుంభకోణం నుంచి బయటపడేందుకే రాహుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మోడీ గతంలో మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు పేరుపెట్టి అనేక రకాలుగా అవమానాలు చేసింది వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. దేశంలో నియంత పాలన సాగుతున్నదని విమర్శించారు. ప్రతిపక్షాల్లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హతమార్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని తెలిపారు. సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించినా అప్పీలుకు నెలరోజుల గడువు ఇచ్చిందనీ, అయినా ఇంత హడావుడిగా అనర్హునిగా ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. నియంతృత్వ మోడీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలనూ వారి ఆధీనంలోకి తీసుకుని ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చరిత్ర కాలగర్భంలో కలిసి పోయిన వారిగతే మోడీకి పడుతుందని హెచ్చరించారు. అదానీ కుంభకోణం కేసు పక్కదారి పట్టించడానికే రాజ్యాంగ విరుద్ధంగా రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఈటి నరసింహ విమర్శించారు.
ప్రజాస్వామ్యం గొంతు నొక్కే చర్య : ప్రజాపంథా
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై పార్లమెంటు సెక్రటేరియల్ అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కే చర్య అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. సూరత్ కోర్టు విధించిన శిక్షను అప్పీలు చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఆదరాబాదరగా మోడీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడం ఫాసిస్టు చర్య అని విమర్శించారు. ప్రతిపక్షం గొంతు లేకుండా చేయాలని దుష్ట పథకంలో ప్రణాళిక ప్రకారమే మోడీ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని పేర్కొన్నారు. అనర్హత వేటును రద్దు చేయాలనీ, న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.