Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగ సమస్యలపై ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఈనెల 25న బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు అనుమతినివ్వాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ధర్నాకు పలు షరతు లను విధించింది. 500 మంది మాత్రమే హాజరుకావాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు, ధర్నాలో పాల్గొనే కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతల జాబితాను పోలీసులకు అందజేయాలంటూ ఆదేశించింది. ధర్నాకు భద్రతా ఏర్పాట్లు చేయాలంటూ పోలీసులకు సూచించింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఎనిమిది వారాల్లోగా సమీక్ష చేయండి...
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై ఎనిమిది వారాల్లో సమీక్ష చేసి తగు నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యుత్ సంస్థల్లో పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లన్నింటినీ సమీక్షించాలంటూ 2018లో హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలపై అప్ప ట్లో ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఆ కేసు ను న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీ శుక్రవారం విచారించా రు. ప్రభుత్వ తీరుపై అగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన విచారణను వాయిదా వేశారు.
లోకల్‌బాడీల ఎన్నికలపై పిల్...
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.