Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్రాంత అడ్వకెట్ జనరల్ సీవీ మోహనరెడ్డి
నవతెలంగాణ - కల్చరల్
మన దేశంలో ఏ రాజకీయ పక్షాలతో ఏర్పడిన ప్రభుత్వం అయినా అది విమర్శ, అసమ్మతి, అనంగీకారం, అసంతుష్టిని సహించే పరిస్థితి లేదని విశ్రాంత అడ్వకెట్ జనరల్ సి.వీ.మోహనరెడ్డి అన్నారు. అసమ్మతి అనేది ప్రజాస్వామిక జీవ లక్షణం అని ఆయన చెప్పారు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్.టీ.ఆర్ కళా మందిరంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కప్పు స్వామి స్మారక ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్న మోహనరెడ్డి 'ప్రజాస్వామ్యం, అసమ్మతి, భారత రాజ్యాంగం' అనే అంశంపై మాట్లాడారు. ఫ్రెంచ్ తత్వవేత్త నుడివిన 'నీ భావాలతో నేను ఏకీభవించను కానీ అలా చెప్పే నీ హక్కును గౌరవిస్తాను...' అనే మాటను నేటి పాలకులు విస్మరించారనీ, ఇది ప్రజాస్వామిక దేశాలకు పెను ప్రమాదమని హెచ్చరించారు.ప్రతి సమాజం కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని చెప్పారు. అదే విధంగా కొన్ని నూతన ఆవిష్కరణలకు స్వేచ్ఛ అవసరమని అన్నారు. అలా లేకుంటే...బుద్ధుడు, జీసస్, మహావీరుడు, మార్టిన్ లూథర్ కింగ్,రామమోహనరారు, తెలుగు వాడైన వీరేశలింగం వంటి వారు వారి కాలం లోని అంధ విశ్వాసాలు, మత అసాంఘీక ధోరణులను ప్రశ్నించకపోతే అభ్యున్నతి సాధ్యపడేది కాదన్నారు. అసమ్మతి లేని ప్రజాస్వామ్యాన్ని శ్మశాన నిశ్శబ్దంగా ఆయన అభివర్ణించారు. మోహనరెడ్డి తన ప్రసంగంలో పలువురు న్యాయ మూర్తుల తీర్పులను ప్రస్తావిస్తూ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఒక కేసు సందర్భంగా... స్వేచ్చ లేకుంటే అజంతా ఎల్లోరా లోని శిల్పాలు, కళా ఖండాలు ఉండేవి కావన్న వ్యాఖ్యను ఉటంకించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 124-ఏ కింద రాజద్రోహం కేసును ఎక్కువగా ఉప యోగించటమనేది రాజ్యాంగ సూర్తికి విరుద్ధమన్నారు. కార్యక్రమానికి జస్టిస్ రఘురాం అధ్యక్షత వహించగా పలువురు మేధావులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.