Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్‌పై కాలయాపన వద్దు పాత పెన్షన్ ముద్దు
- పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి :ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని 84 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ అమలుపై వచ్చిన వినతుల నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఉద్యోగులను మోసగించడమేనని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ విమర్శించారు. సీపీఎస్‌పై కమిటీలతో కాలయాపన చేయొద్దనీ, పాతపెన్షన్‌ను పునరుద్ధరించడమే ముద్దని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకి పాత పెన్షన్ పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని లిఖితపూర్వకంగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగుల పట్ల కమిటీ ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్, హర్యానాలో పాత పెన్షన్ అమలును పునరుద్ధరించకుంటే ఓటమి ఖాయమని బీజేపీ భావిస్తున్నదని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చిన తీర్పే రాబోతుందని ఊహించి కంటి తడుపు చర్యగా కమిటీ ప్రకటించడం ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించిందని తెలిపారు. మొన్న కేంద్ర ప్రభుత్వం డీవోపీటీ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ జరుగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదంటూ నిరసన చేపట్టిన ఉద్యోగులకు వేతనాల కోతతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమం పట్ల కమిటీ వేయడం హాస్యాస్పదమని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల చేతుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఉద్యోగుల వాటా కలిపి రూ.తొమ్మిది లక్షల కోట్ల పెన్షన్ ఫండ్‌ను తిరిగి చెల్లించాలని కేంద్రాన్ని కోరారు. పాత పెన్షన్ అమలు చేయటమనేది రాష్ట్రాలకు ఆర్థిక భారమని తెలిపే కేంద్రం, ఆర్థిక మేధావులు ఒక్కసారి ఈదేశంలోనే ఉన్న పశ్చిమ బెంగాల్లో పది లక్షలకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తెలిపారు.