Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిడెడ్ టీచర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్
- యూఎస్పీసీ నాయకులు
- యూఎస్పీసీ ఆధ్వర్యంలో పీఏవో ఆఫీస్ ఎదుట నిరసన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం అబిడ్స్‌లోని పీఏవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్, టీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు హరికిషన్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్‌లు పాల్గొనానరు. అంతకుముందు యూఎస్పీసీ ప్రతినిధుల బృందం పీఏవో అధికారి హనుమంతుని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నెల మొదటి తేదీన చెల్లించాల్సిన వేతనాలు ప్రతినెలా 15వ తేదీ వరకు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రతినెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించలేదని.. తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న వేతనాలను, జీపీఎఫ్ క్లైములు, మెడికల్, టీఎస్జీఎల్ఐ బిల్లులు, ఈఎల్ బిల్లులు, పీఆర్సీ, పెన్షనరీ బకాయిలు తదితర బిల్లులన్నీ ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ.. ఏడు నెలలుగా సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ కాలేదని.. సదరు పెండింగ్ బిల్లులన్నింటినీ మార్చి 31లోగా క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఎయిడెడ్ టీచర్ల వేతనాలు, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు సింహాచలం, శారద, రాజారావు, శ్యామ్ సుందర్, రాంబాబు, సీతారామ శాస్త్రి, సోమిరెడ్డి, లక్ష్మణ్ రాథోడ్, శ్రీనివాస్ రాథోడ్, రేణుక, శశికళ, రేణు తదితరులు పాల్గొన్నారు.