Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు: ప్రోవీసీ డీఎస్ రావు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, బెంగుళూరు ప్రాంగణాల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆ వర్సిటీ ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీకి యూజీసీ ఏర్పాటు చేసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చిందన్నారు. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ వంటి కోర్సులను నిర్వహిస్తు న్నామని వివరించారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) ప్రకారం లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. సైన్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డొమైన్ల నుంచి 25 విభాగాల్లో మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చని అన్నారు. మొదటి సెమిస్టర్ విద్యార్థులందరికీ ఒకేలా ఉంటుందనీ, రెండో సెమిస్టర్ నుంచి సబ్జెక్టులను ఎంచుకుని చదవొచ్చని సూచించారు. గీతం అడ్మిషన్ టెస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఈనెల 31 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు నిర్వహిస్తామని వివరించారు. గీతం ప్రవేశ పరీక్షతోపాటు జేఈఈ మెయిన్, ఈఏపీసెట్, తెలంగాణ ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లను అందజేస్తామన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు స్కాలర్షిప్లను మంజూరు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి లాయల్టీ, ఉద్యోగుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తామని అన్నారు. గీతం ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు రూ.1,200 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాలకు www.gat.gitam.edu వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అడ్మిషన్స్ డైరెక్టర్ సి ఉదయ్ కుమార్, అడ్మిషన్ల విభాగాధిపతి కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.