Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారం కోసం నానాగడ్డి కరుస్తున్న కాషాయపార్టీ
- అప్రజాస్వామికంగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు
- నమ్మి ఓట్లేస్తే.. ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్న కరీంనగర్ ఎంపీ బండి
- మోడీ దగ్గర, ఢల్లీీలో పతార్ ఉందని చెప్పుకునుడే తప్ప...
- నియోజకవర్గానికి రూపాయి తెచ్చిన మొఖం లేని సంజరు
- ప్రజలంతా సంఘటితమై ఓటుతోనే బీజేపీకి బుద్ధిచెప్పాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'ప్రజల ఆస్తులను తెగనమ్ముతూ.. పేదలపై పన్నుల భారాన్ని మోపుతూ.. ప్రజల మధ్య మతచిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మతోన్మాద బీజేపీకి గోరి కట్టే రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అడ్డదారిన అధికారం చేపట్టి.. తెలంగాణలోనూ అధికారం కోసం ఏగడ్డి కరిచేందుకైనా సిద్ధపడి అడ్డదారుల్లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నమూ చేసిందని విమర్శించారు. శ్న్రించేవారిపై దాడులు, అరెస్టులకు దిగుతున్న కేంద్రంలోని బీజేపీ.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేసిందన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ఇక్కడి ఎంపీ సంజరు దగాకోరులా తయారయ్యాడని, ఢిల్లీ నేతల చెప్పులు మోస్తూ.. రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. మోడీ దగ్గర పతార్ ఉందని చెప్పుకునే సంజరు.. నియోజకవర్గ ప్రజలకు రూపాయి తెచ్చిన మొఖం లేదని తెలిపారు. ప్రజలకు, శ్రామికవర్గానికి శత్రువులా తయారైన బీజేపీకి గోరికట్టి, మోడీ సర్కారుకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని స్పష్టంచేశారు. సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య యాత్ర ఆదివారం రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో సాగింది. ఆయా ప్రాంతాల్లో బృందసభ్యులు ఆశయ్య, జయలక్ష్మి, స్కైలాబ్‌బాబు, జగదీష్, అడివయ్యకు కార్యకర్తలు, ప్రజలు నిరాజనాలు పలికారు. భారీ బైక్‌ర్యాలీలతో, బతుకమ్మలతో మహిళలు స్వాగతం, వీడ్కోలు పలికారు. కాగా, ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, కార్నర్ మీటింగ్‌లలో వీరయ్య ప్రసంగించారు.
దేశ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెడతూ దేశంలోని 46 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువనే ఉంచారని అన్నారు. కార్మిక చట్టాలను హరిస్తూ వారిని శ్రమదోపిడికి గురయ్యేలా యజమానులకు అనుకూల చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికే 8గంటల పని సమయం 12గంటలకు చేశారని, కనీసం వేతనం రూ.4628 ఉంటే సరిపోతుందనే అవగాహనకు రావడం వారు కార్మికులు, కర్షకులు, రైతాంగానికి శత్రుముకగా తయారైన పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. మొత్తం ప్రజల సంపదను, ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు దోచిపెట్టడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహులని అంటున్న బీజేపీ, దాని సన్నిహితుడు అదానీయే పెద్ద దేశద్రోహులని అన్నారు. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న బీజేపీ అడ్డగోలుగా నల్ల చట్టాలు తీసుకొస్తూ ప్రజలను అధోగతిపాలు చేస్తున్నారని అన్నారు. అలాంటిదే విద్యుత్ బిల్లు కూడా అని, అది గనుక వస్తే.. సిరిసిల్ల పవర్లూమ్పైనా, రైతుల వ్యవసాయంపైనా పెనుభారం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని, అందులోంచి బయటపడాలంటే బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థలను ప్రజలు దగ్గరికి రానివ్వొదని కోరారు.
సమస్యలను విస్మరించిన ఎంపీ సంజరు..
ఇక్కడి ప్రజలు నమ్మి పార్లమెంట్ సభ్యునిగా బండి సంజరును ఎన్నుకుంటే.. ఆయన మాత్రం దగాకోరుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు 'ఢిల్లీలో మా సర్కారే అధికారంలో ఉందని, కరీంనగర్లో ఎయిమ్స్ తరహా వైద్యసంస్థను తీసుకొస్తామని చెప్పిన ఆయన కనీసం చిన్న ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్రలో ఎంత సేపు ప్రజల మధ్య మతవిధ్వేషాల ప్రసంగాలే తప్ప.. తెలంగాణ ప్రజల గోసను పార్లమెంట్లో వినిపించింది లేదన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే మార్గం, సిరిసిల్లలో శంకుస్థాపనకే పరిమితమైన ఈఎస్ఐ ఆస్పత్రి, కేంద్రీయ విద్యాలయ పక్కాభవనం, వరంగల్ - జగిత్యాల జాతీయ రహదారి, కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రైల్వే ఫ్లైఓవర్ ఇలా.. చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, డిమాండ్లు ఉన్న ఈ ప్రాంతవాసులకు పైసా పని చేసింది లేదని విమర్శించారు. ఇంకా మిగిలున్న ఏడాది పదవికాలంలో ఆయన చేసేదీ ఏం ఉండదని చెప్పుకొచ్చారు.
యాత్రకు మద్దతుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు...
సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రకు మద్దతుగా ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికి కేంద్ర బీజేపీ సర్కారును ఎండగట్టారు. కరీంనగర్ సభలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ మాట్లాడుతూ.. మోడీ సర్కారును బొందపెట్టే రోజులు దగ్గర పడ్డాయని, మళ్లీ పైకి తేలకుండా అంటార్కిటికా మహాసముద్రంలో పడేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్‌బిల్లుల పెంపును నిరసిస్తూ ప్రాణాలొదిలిన చరిత్ర కమ్యూనిస్టులదని, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వారు మాత్రమే ముందు ఉంటారని అన్నారు. రాజన్న సిరిసిల్ల సభలో తెలంగాణ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మెన్ గూడురు ప్రవీణ్, సీపీఐ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్, తదితరులు ప్రసంగించారు.