Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఐక్యమవుతున్నాయి
- మోడీ భయపడుతున్నాడు : తమ్మినేని
- అప్పుల మోడీని దించేయాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
- మహిళలకు బీజేపీ వ్యతిరేకం: మల్లు లక్ష్మి
నల్లగొండ జన చైతన్య యాత్ర నుంచి బి.బసవపున్నయ్య
భారతీయతను నాశనం చేస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానీవ్వబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. దేశాన్ని కాపాడేందుకే రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్రలను చేపట్టినట్టు వెల్లడించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ భయపడుతున్నాడనే విషయం అర్థమవుతున్నదని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించేందుకు దేశంలోని లౌకిక, ప్రజాస్వామిక శక్తులను కలుపుకుపోతామని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జనచైతన్యయాత్ర బహిరంగ సభ జరిగింది. సభకు పార్టీ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను నేరవేర్చుకునే పనిలో ఉందని విమర్శించారు. పార్టీ కుట్రలు, కుతంత్రాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. దిగిపోయినా, తమ ప్రభావాన్ని కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దుర్మార్గమైన ద్వేషపూరిత వాతావారణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. క్రమపద్ధతి ప్రకారం తొమ్మిదేండ్లుగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య భావనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలించడం ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని వివరించారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల పేదలు అవసరం లేదన్నారు. వారికి కేవలం కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కావాలని వ్యాఖ్యానించారు. హిందువుల కోసం బీజేపీ ఎలాంటి పథకాలు తేవడం లేదనీ, కుల,మతాల రొచ్చును రుద్దుతూ సమాజాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పారు. ఒకే కులం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆదానీ సంపదంతా ఆక్రమాల పుట్ట అని విమర్శించారు. వందల కోట్ల పేద ప్రజలపై మోడీకి ప్రేమ లేదనీ, కేవలం అదానీ, అంబానీలే కావాలని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేయడం ద్వారా రిజర్వేషన్లకు ఎసరు పెడుతున్నారని చెప్పారు. అందుకే బీసీ జనాభా లెక్కల గణనను చేపట్టడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోడీని దించడం ఖాయమని హెచ్చరించారు. చివరకు రాష్ట్రాలు అప్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను పోగేసేందుకు సీపీఐ(ఎం), సీపీఐ ప్రయత్నం చేస్తున్నాయని గుర్తు చేవారు. కేరళలో బీజేపీకి ఉన్న సీటును విజయన్ ఊడబెరికారని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీకులతో సంబంధం ఉన్న దొంగలను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మోడీ దుర్మార్గుడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ దుర్మార్గుడని నల్లగొండ ఎమ్మల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. మతోన్మాద చర్యల ద్వారా దేశాన్ని భ్రష్టుపట్టించే చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. మొత్తం దేశాన్ని అమ్మకానికి పెట్టారని అన్నారు. బీజేపీ అమానుష చర్యలను ప్రజలకు తెలియజేప్పేందుకు జనచైతన్య యాత్రను చేపట్టిన సీపీఐ(ఎం)ను అభినందించారు. అంబానీ, అదానీల కోసం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని అన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ ప్రధాని చేయని విధంగా అప్పులు చేశారని చెప్పారు. మోడీ రూ.152 లక్షల కోట్ల అప్పులను ప్రజలపై రుద్దారని వివరించారు. 16 రకాల సంస్థలను ప్రయివేటుపరం చేయడాన్ని ఖండిస్తున్నట్టు వివరించారు. ఈడీ, మోడీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ భయపడబోరని చెప్పారు. బీజేపీని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత్:మల్లు లక్ష్మి
మన దేశం భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటుందనీ, అలాంటి దేశాన్ని కుల,మతాల పేరుతో చీల్చే ప్రయత్నం జరుగుతున్నదని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. తొమ్మిదేండ్ల కాలంలో మహిళలు, రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని చెప్పారు. మహిళలకు బీజేపీ వ్యతిరేకమనీ, మనుధర్మాని అమలుచేయడం ద్వారా అణచివేతకు పాల్పడుతున్నదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం ద్వారా ఆర్థిక భారాలను ప్రజలు, మహిళలపై మోపుతున్నారని గుర్తు చేశారు. 2014 నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. గ్యాస్, పెట్రోల్ తదితర ధరలు దారుణంగా పెరుగుతున్నాయన్నారు. రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత పెరుగుతున్నదన్నారు. ఎక్కువగా ఉండేదనీ, ఇప్పుడది దేశ్యాపితం అయిందని చెప్పారు. ఇందుకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్నారని వివరించారు.
భారీ ర్యాలీ
మిర్యాలగూడ నుంచి నల్లగొండ వరకు జనచైతన్య యాత్ర మోటార్ సైకిల్ యాత్రలో భారీగా జనం పాల్గొన్నారు. మధ్యలో ఆయా గ్రామాల ప్రజలు యాత్రకు స్వాగతం పలికారు. ఈ యాత్రకు సంఘీభావం చెప్పేందుకు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు నేతలు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, ఐద్వా నేత పాలడుగు ప్రభావతి, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, తదితరులు పాల్గొన్నారు.