Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం రూ.పది వేలు ఇస్తున్నాం
- ఫసల్‌బీమా మోడీ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు
- ధరలు పెంచుడు.. మీటర్లు పెట్టుడే.. బీజేపీ పని
- పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులు
- సీపీఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి : ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్న బీజేపోళ్లు ముందుగా ప్రధాన మంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఫసల్ బీమా ఎందుకు అమలు చేయట్లేదో సమాధానం చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌లో దీన్‌దయాళ్ జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని జిల్లా స్థాయి గ్రామ పంచాయతీలకు ఆవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేల సాయం ఇస్తున్నామని, బీజేపీ వాళ్లు మాత్రం రూ.పది వేలు సరిపోవు అంటున్నారని, వాళ్లకు దమ్ముంటే ఢిల్లీ నుంచి రూ.10 వేలు తెచ్చి ఇస్తే ఇద్దరం కలిసి రూ.20 వేలు ఇద్దామని తెలిపారు. బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. ధరలు పెంచుతూ మీటర్లు పెట్టుడు బీజేపోళ్ల పని అని విమర్శించారు. రెండు రోజుల కిందట సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారని, నాలుగైదు రోజులకు ఒకసారి నీరు వస్తుందని, బీదర్‌లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి ఇదేనని తెలిపారు. మన దగ్గరప్రతి ఇంటికీ ప్రతి రోజూ నీరు వస్తుందని, ఇది తెలంగాణ మోడల్ అని చెప్పారు. ప్రధాన మంత్రి సంసద్ యోజనలో పదికి పది ఆవార్డులు తెలంగాణలోని పంచాయతీలే దక్కించుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే ఇది సాధ్యమయిందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని ప్రకటించారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం సర్పంచ్‌లకే ఉంటుందన్నారు.
ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు సీపీఆర్
ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని శిక్షణ ఇప్పిస్తున్నారని మంత్రి హారీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలకు విశ్రాంతి ఉంటుందని, ఒక్క గుండె మాత్రం నిరంతరం పనిచేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ 4 వేల సడెన్ కార్డియాక్ అరెస్టులు జరుగుతుండగా ఇందులో 90 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రాణాపాయం లో ఉన్న వ్యక్తికి ఎవరైనా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడొచ్చన్నారు. పారామెడికల్, వైద్య, మున్సిపల్, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ప్రతినిధులు, ఇతర వర్కర్లకు సీపీఆర్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నా రు. వైద్య విభాగంలో 1240 మంది మెడికల్ ఆఫీసర్లు, 1300 మంది స్టాఫ్ నర్సులు, 8500 మంది ఏఎన్ఎంలు, 26 వేల ఆశాలు శిక్షణ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రూ.15 కోట్ల వ్యయంతో 1200 ఏఈడీ మిషన్లు కొనుగోలు చేశామన్నారు. అనంతరం జిల్లాలోని నారాయణఖేడ్‌లో 50 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. అదే విధంగా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రి పర్యటనలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్యరావు, భూపాల్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్ పాల్గొన్నారు.