Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు
- సిట్ అదుపులో మరో ఐదుగురు?
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ కేసులో నిందితుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరికి ప్రశ్నాపత్రాలను విక్రయించినట్టు తెలుస్తోంది. 9 మంది నిందితుల అరెస్టుతో మొదలైన ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఈ కేసులో ఇంకెంత మంది అరెస్టవుతారో వేచి చూడాలి.
100 మార్కులపైన వచ్చిన వారిని విచారణ
100 మార్కులపైన వచ్చిన అభ్యర్థుల లిస్ట్ తయారు చేసిన సిట్ అధికారులు వారిని కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం 20 మంది అభ్యర్థులు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. దాదాపు 15 అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా అభ్యర్థి బయోడేటాను పరిశీలించిన అధికారులు పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని ఎఫిసియేన్సీ టెస్ట్ నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని విచారించిన అధికారులు వారు ఎంతవరకు చదివారు, వారి మార్కులు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు అనే పలు అంశాలను రికార్డ్ చేసినట్టు తెలిసింది. అవసరమైతే తిరిగి రావాల్సి ఉంటుందని అభ్యర్థులను అధికారులు ఆదేశించినట్టు సమాచారం.
ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ
ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ పలువురికి విక్రయించినట్టు తెలుస్తోంది. లక్షలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్ లాగా ఒకరికి తెలియకుండా మరొకరు విక్రయించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలా దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానిస్తున్నారు. కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. సోమవారం నలుగురు నిందితులను ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, కేతావత్ రాజేశ్వర్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ ఇంట్లో రెండోసారి సోదాలు చేసిన అధికారులు రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.