Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు సేవలు
- సమాచార, పౌర సంబంధాలశాఖ కమీషనర్ అర్వింద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు మార్చి 29 నుంచి పది రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టులకు పురస్కార కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిభిరం నిర్వహించాల్సిందిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావుకి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించిన మేరకు ఈ నెల 29 తేది నుండి మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయనున్నట్టు అర్వింద్ తెలిపారు.ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (సీబీపీ) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 తదితర డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్‌స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు తదితర పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షల రిపోర్ట్లు అదే రోజు అందజేయనున్నారు. వైద్య శిబిరం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ శిబిరంలో రాష్ట్ర స్థాయి అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలకు చెందిన అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టుల కోసం ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.