Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిడెడ్ జీతాలు, పెండింగ్ బిల్లులివ్వాలని డిమాండ్
- పెద్ద ఎత్తున తరలిరానున్న ఉపాధ్యాయులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎయిడెడ్ టీచర్ల మూడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలనీ, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నది. ఉదయం 11.00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నా చౌక్‌లో కొనసాగనున్నది. సంఘాలు, అనుబంధాలతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులందరూ పెద్దఎత్తున పాల్గొని రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ ధర్నా జరుగనున్నది. ట్రెజరీల్లో పాసై ఆర్థిక శాఖ వద్ద పెండింగులో ఉన్న బిల్లులన్నీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా క్లియర్ చేయాలని యూఎస్పీసీ డిమాండ్ చేస్తున్నది. రెండేండ్లుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేతనాల కోసం 15వ తేదీ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మొదటి పనిదినంలోనే వేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ధర్నా జరుగనున్నది. కేటాయించిన బడ్జెట్ ఉన్నప్పటికీ మూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వడంలేదు. సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, టీఎన్జీఎల్బీ, జిపిఎఫ్ క్లైములు, పిఆర్సీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు తదితర బిల్లులన్నీ నెలల తరబడి మంజూరు కావటం లేదు. యూఎస్పీసీ భాగస్వామ్య ఉపాధ్యాయ సంఘాలు పదే పదే ప్రాతినిథ్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జీపీఎఫ్ సొమ్ము కూడా అవసరానికి ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. మరో పీఆర్సీ గడువు సమీపిస్తున్నా పద్దెనిమిది వాయిదాల్లో ఇస్తామన్న రెండు నెలల గత పీిఆర్సీ బకాయిలు పదకొండు నెలలు గడిచినా కేవలం మూడు, నాలుగు కు మించి జమ కాలేదు. వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపుకొస్తున్నా పాసైన బిల్లులకు సంబంధించిన నగదును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ చొరవ చూపట్లేదు. ఈనెల 24న జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు నిర్వహించి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయినప్పటికీ ఆర్థికశాఖలో చలనం లేదు. ఈ నేపథ్యంలో యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పూనుకున్నారు.