Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
రెండేండ్లలో మహబూబ్‌నగర్ జిల్లాలో 50వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా రెండు కొత్త బ్యాంకులు ప్రారంభం అవుతున్నాయని, పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. భారీ కంపెనీలు మహబూబ్‌నగర్ వైపు దృష్టి సారిస్తున్నాయని తెలిపారు. లిథియం అయాన్ గిగా పరిశ్రమ ఏర్పాటుతో వేలాదిగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. విద్యుత్ వాహనాలకు అవసరమైన లిథియం బ్యాటరీలను ప్రపంచానికి సరఫరా చేసే కేంద్రంగా మహబూబ్‌నగర్ గుర్తింపు పొందనుందన్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రాలు పోటీపడినా తెలంగాణలో ఉన్న ఇండిస్టీ ఫ్రెండ్లీ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కారణంగా పరిశ్రమ మనకు దక్కిందని చెప్పారు. త్వరలో ఐటీ కారిడార్‌ను ప్రారంభించబోతున్నామని, పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ సంస్థలను ఇక్కడ నెలకొల్పేందుకు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఫెడరల్ బ్యాంకు జోనల్ హెడ్ దిలీప్, రీజినల్ హెడ్ ప్రమోద్, మేనేజర్ శరత్ చంద్ర, కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్, రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఫరూక్, అడ్వకేట్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.