Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ-ఓయూ
చరిత్ర అధ్యయనం ద్వారా మాత్రమే నూతన చరిత్రను నిర్మించగలమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఐసీహెచ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్) సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఓయూలోని అంబేద్కర్ సెంటర్ సెమినార్ హాల్లో రెండ్రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కొండా నాగేశ్వర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.లింబాద్రి మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా తెలంగాణ జీవన విధానంలో బహుళ సంస్కృతులు ప్రోది చేసుకున్నాయని తెలిపారు. బౌద్ధ, జైనుల కాలం నుంచి ఈ ప్రాంతం మత సామరస్యానికి, ఉన్నత మానవతా విలువలకు, సహజీవనానికి కేంద్ర బిందువుగా ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వారి వారి గ్రామాల చరిత్రపై, ప్రాంతాల చరిత్రపై లౌకిక స్ఫూర్తితో రచనలు కొనసాగించి, మరుగున పడిన మట్టి మనుషుల చరిత్రను గ్రంథీకరించాలని సూచించారు. అంబేద్కర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులు గత చరిత్రను అధ్యయనం చేయడానికి ఎంతో సుముఖంగా ఉన్నారని, వారికి కావాల్సిందల్లా ప్రోత్సాహకమేనని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త వేద కుమార్, ప్రముఖ ఆర్కియాలజీ నిపుణులు శివ నాగిరెడ్డి, ప్రముఖ హిస్టరీ విభాగ రిటైర్డ్ ఆచార్యులు ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, యూజీసీ డీన్ ప్రొ.మల్లేశం, హిస్టరీ విభాగధిపతి ప్రొ. జి.అంజయ్య, ప్రొ. లావణ్య, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొ.సుధారాణి, ఆర్కియాలజీ విభాగ ఆచార్యులు ప్రొ. శ్రీనివాసన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ డైరెక్టర్లు ప్రొ.మంగు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ అజిమున్నీసా, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొ.సూర్యనారాయణ, ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.