Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జనచైతన్య గీతాలు' పుస్తకావిష్కరణలో డీజీ నర్సింహారావు, ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాదంపై, ప్రజావ్యతిరేక పాలనపై పాడుదాం.. పోరాడుదామంటూ ఎక్కుపెట్టిన అక్షరాయుధాలే 'జనచైతన్యగీతాలు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు అన్నారు.సోమవారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్యగీతాలు పుస్తకాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఆనందాచారి, జె బాబురావుతో కలిసి డీజీ నర్సింహారావు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా పాడుదాం..పోరాడుదాం..! అనే నినాదంతో సాంస్కృతిక పోరాటాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో మతోన్మాద ప్రమాదం ఆవరించిందని చెప్పారు. ఈ దశలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు తమ ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి మూడు జనచైతన్య యాత్రలు సాగుతున్నాయని తెలిపారు. ఈ యాత్రలకు ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. మోడీ ప్రభుత్వం మోపిన వివిధ రకాల భారాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని చెప్పారు. మోడీ, అమిత్షా నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ, ప్రజలపై భారాలను మోపుతున్నదని చెప్పారు. 23 కోట్ల మందిని పేదలుగా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంటే ఆదానీ, అంబానీల సొత్తుగా మార్చేశారని విమర్శించారు. ఆనందాచారి మాట్లాడుతూ గొంతెత్తిన ప్రజాగీతాలు జన చైతన్య యాత్రకు కవాతు గీతాలై మేల్కొల్పుతున్నాయని తెలిపారు. 20 మంది ప్రముఖ రచయితలు పాలకుల దుష్ట విధానాలపై ఎక్కుపెట్టిన అక్షరాయుధాలే జనచైతన్య గీతాలన్నారు. రాష్ట్ర శాసనమండలి సభ్యులు గోరెటి వెంకన్న జానపద శైలిలో రాసిన పాట మోడీ విధానాలపై జులిపించిన పదునైన కత్తిలా ఉందని చెప్పారు. భార్యాభర్తల సంవాదంతో పాటలున్నాయన్నారు. జానపద శైలిలో ఎంకీబావ సంవాదంతో సాగే గేయాలు కూడా ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని నేటి ప్రభుత్వ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టటమే ఈ పాటల ఉద్దేశమన్నారు. మోడీ ఆర్థిక విధానాలతో పేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా 'పాడుదాం..పోరాడుదామంటూ' ఉద్యమాన్ని సాగించాల్సిన అవశ్యకత పెరిగిందని చెప్పారు.