Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయాధికారులు, పోలీసులతో సీఐడీ డీజీ మహేశ్ భగవత్
- ఎంసీఆర్హెచ్ఆర్డీలో మూడ్రోజుల న్యాయాధికారుల శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
న్యాయాధికారులు, పోలీసులు సైబర్ చట్టాలు, నేరాలపై సంపూర్ణ అవగాహనను కలిగి ఉండాలని సీఐడీ రాష్ట్ర అదనపు డీజీ మహేశ్ భగవత్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడ్రోజుల పాటు సైబర్ లా, సైబర్ నేరాలపై జరిగే శిక్షణ శిబిరాన్ని మహేశ్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో 33 మంది న్యాయాధికారులు, కొత్తగా నియమితులైన జూనియర్ జడ్జిలకు శిక్షణనిస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ భగవత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అన్ని నేరాల కంటే సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవటం కష్టతరంగా మారిందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సైబర్ నేరాలు పెచ్చరిళ్లిపోతున్నాయనీ, వాటిని అరికట్టడం దర్యాప్తు అధికారులకు సవాలుగా మారిందని తెలిపారు. ముఖ్యంగా, సైబర్ నేరాలకు సంబంధించిన ఒక నేరాన్ని పరిష్కరిస్తుంటే వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని ఆయన అన్నారు. వీటిని నిరోధించటానికి ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను రూపొందించటం, ఉన్న చట్టాలను మరింతగా బలోపేతం చేయడం వంటి చర్యలు నిరంతరం సాగుతున్నాయని తెలిపారు.
సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేయాలంటే ఆ నేరాలను దర్యాప్తు చేసే పోలీసు విభాగాన్నే గాక అలాంటి కేసులను విచారించే న్యాయమూర్తులు సైతం సదరు నేరాలపై పూర్తి అవగాహనను కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల మధ్య తగిన సమన్వయం కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర సీఐడీ విభాగం గతంలో సైతం శిక్షణా శిభిరాలను సంబంధిత అధికారులు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిభిరంలో సైబర్ లా, సైబర్ నేరాలకు సంబంధించిన ప్రముఖ నిపుణులు, ఈ నేరాల దర్యాప్తులో ఆరితేరిన అధికారులు శిక్షణనివ్వడం జరుగుతుందని మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సంక్షేమ విభాగం అభిలాష బిస్త్తో పాటు పలువురు అధికారులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.