Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్.మూర్తి
నవతెలంగాణ-అంబర్పేట
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబర్పేట చౌరస్తా కూడలిలో అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ లీకేజీ జరిగి పది రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమని, తక్షణమే స్పందించి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిట్ విచారణ కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలను పారదర్శకంగా నిర్వర్తించే వ్యవస్థను అమలు చేయాలని కోరారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిస్వాల్ కమిటీ చెప్పిన ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరారు. అదేవిధంగా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, అంబర్పేట్ సెక్రెటరీ నాగేందర్, నాయకులు స్టాలిన్, హష్మీ సహన, సంధ్య, శ్రీకాంత్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.