Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించే వారు దేశద్రోహులు.. దోపిడీదారులు దేశభక్తులా?
- మోడీ చేసిన తప్పులకు వందేండ్ల శిక్ష వేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవ తెలంగాణ - మహబూబ్నగర్
భారతదేశంలో ప్రజల సంపదను దోచుకుంటున్న ఆలీబాబా అరడజన్ దొంగలను నరేంద్ర మోడీ రక్షిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్, రక్షణ రంగం లాంటి సంస్థలను దోచుకుంటున్న కార్పొరేట్ వ్యాపారులకు మోడీ రక్షణగా ఉన్నారని ఆరోపించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తున్న బీజేపీ పుట్టకముందే ఈ దేశంలో హిందూమతం ఉందని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలిస్తున్నారన్నారు. దేశంలో కార్పొరేట్ వ్యాపారులు అత్యధికంగా నిధులు ఇస్తున్నది ఒక్క బీజేపీ పార్టీకేనని, అందుకే వారి కోసమే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశంలో ఎన్నికలు మొత్తం అవినీతిమయంగా మారాయని, కార్పొరేట్లు, బడా పెట్టుబడుదారులు మాత్రమే చట్టసభలకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ.. ప్రజలను దోపిడీ చేస్తున్న వారిని దేశభక్తులా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల కిందట ఎక్కడో ఉన్న అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎలా ఎదిగిందని ప్రశ్నించారు. దేశ సంపదను దోచుకుని స్వేచ్ఛగా విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని మోడీ ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిని మాత్రం చట్టసభల నుంచి బహిష్కరించడం అన్యాయమన్నారు. అలా అయితే.. మోడీ చేసిన తప్పులకు వందేండ్ల శిక్ష పడాలన్నారు.
కమ్యూనిస్టులకు చట్టసభల్లోకి వెళ్లడానికి బలం లేకపోయినా ప్రజలకు అన్యాయం చేసే పార్టీలను ఓడించే సత్తా ఉందన్నారు. తెలంగాణలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి బాలకిషన్, జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్వర్గౌడ్, గద్వాల జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, సురేష్, రాము, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.