Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ -హైదరాబాద్
రాష్ట్రంలోని కోటీ ఏడు లక్షల మంది కార్మికులకు 16 ఏండ్లుగా కనీస వేతనాల పెంపుదల చేయలేదంటూ దాఖలైన పిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఐదు జీవోలు ఇచ్చిన ప్రభుత్వం వాటి అమలుకు ఎందుకు గెజిట్లను ప్రకటించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంఘటిత, అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి దగ్గుల సత్యం వేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 19కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో 149 ప్రభుత్వ, ప్రయివేటు విభాగాల్లో కోటీ 7 లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. వారికి 2007లో కనీస వేతన పెంపు జరిగింది. ఐదేండ్లకోసారి కనీస వేతనాల పెంపునకు ప్రభుత్వం జీవోలు ఇవ్వాలి. ఇప్పటికి మూడుసార్లుగా పెంపు జరగాలి. చేయలేదు. 20021 జూన్‌లో ప్రభుత్వం 5 జీవోలు ఇచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్లు 21, 22, 23, 24, 25 జారీ చేసిన ప్రభుత్వం వాటి అమలుకు గెజిట్లను మాత్రం పబ్లిష్ చేయలేదు. ఇది చట్ట వ్యతిరేకం. కార్మికుడిపై ముగ్గురు ఆధారపడతారు. అంటే 3 కోట్ల మందికిపైగా కొనుగోలు శక్తి ప్రమాణాలు పెరుగుదల లేకుండా ప్రభుత్వం చేసింది. కార్మికులు కష్టాలు పడుతున్నారు. జీవన ప్రమాణాలు ఘోరంగా మారాయి. దయనీయంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఐదు జీవోల అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ ప్రకటించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. సెమీ స్కిల్ వర్కర్‌కు 2007లో రూ.437గా నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పడు రూ.919లకు, సిల్క్ వర్కర్‌కు రూ.469 నుంచి రూ.1039లకు, హైస్కిల్డ్ వర్కర్‌కు రూ.469 నుంచి రూ.1173లకు పెంపుదల చేయాల్సివుంది.. అని పిటిషనర్ పిల్లో పేర్కొన్నారు. విచారణ జూన్ 19కి వాయిదా పడింది.