Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ, అంబానీకి దోచిపెడుతున్న మోడీ: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- ఎరుపెక్కిన నారాయణపేట.. డప్పు వాయిద్యాలతో స్వాగతం
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యమని, ఆ పార్టీ ఎంపీల్లో సగం మంది దొంగలేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. దేశ సంపదను మోడీ అదానీ, అంబానీకి దోచి పెడుతున్నారని విమర్శించారు. బుల్డోజర్లు ఎర్రజెండాను అడ్డుకోలేవని హెచ్చరిం చారు. సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు నుంచి ప్రారంభమైంది.
డప్పు వాయిద్యాలు, మహిళలు మంగళహారతులతో ముందు నడవగా ఎర్రసైన్యం కవాతు, బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలుకగా.. యాత్ర ముందుకు సాగింది. జానపద కళాకారులతో వేసిన బొడ్డెమ్మ ఆట నృ త్యాలు అలరింపజేశాయి. కోయిల్‌సాగర్ కోటకొండ మీదగా దామరగిద్ద నుంచి నారాయణపేట మరికల్, అమరచింత, ఆత్మకూరు, మీదగా యాత్ర గద్వాల చేరుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రసైనికులు కోటకొండకు వరకు వచ్చి నారాయణపేట జిల్లాకు సాగనంపారు. కోటకొండ తదితర ప్రాంతాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జాన్‌వెస్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షాల ప్రజాప్రతినిదులను సీబీఐ విచారణ పేరుతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎంపీలుగా ఉన్న బీజేపీ నేతలలో సగం మంది దొంగలే ఉన్నారని ఆరోపించారు. బీజేపీ హయాంలో పేద ధనికుల మధ్య తేడా పెరిగి.. ధనికులు కోటీశ్వరులుగా మారుతున్నారని.. పేదలు నిరుపేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తుందని విమర్శించారు. బ్యాంకులను లూటీ చేసి కోట్ల రూపాయలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన మోడీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపడమే సీపీఐ(ఎం) ఏకైక లక్ష్యమన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. 20 లక్షల ఉద్యోగాలను తొలగించారని తెలిపారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు.
మోడీని ప్రశ్నించినందుకే.. ప్రతిపక్ష నేత.. పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారంటే.. బీజేపీ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన నిబంధనల మేరకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను నొక్కడానికి.. రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని తెచ్చే యోచనలో బీజేపీ పాలకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒకవైపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తుంటే.. మరోవైపు రాజ్యాంగ ఫలాలు ప్రజలకు దక్కకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు చేయడం దారుణమన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే ఉద్యోగాలు వస్తాయన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయన్నారు. ప్రజా సంపద రెట్టింపు చేస్తామన్నారు. వారి సంపద ఏమోగానీ పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 8 వేల కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నవారు 80 మంది ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 166కు చేరిందంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షమో ప్రజలు గ్రహించాలన్నారు. కారు చౌకగా దొరికే బొగ్గును అదానికి అప్పజెప్పి.. ఆయన నుంచి ఖరీదైన ధరకు కొనుగోలు చేస్తున్నారంటే మోడీకి పారిశ్రామికవేత్తల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కూలీలు కోరుతుంటే.. మరోవైపు బడ్జెట్లో నిధులు పూర్తిగా తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు, రమ, నాయకులు అరుణ, శ్రీకాంత్, వినోద్, విజరు, ధర్మానాయక్, ప్రసాద్, వెంకట్రాంరెడ్డి, గోపాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.