Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ బాటపడుతున్న ప్రజలు
- జన చైతన్య యాత్రలో.. : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జుకృష్ణన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య
నవ తెలంగాణ సిద్దిపేట అర్బన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలను కాపాడుతూ ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని, తొమ్మిదేండ్ల మోడీ పాలనలో ప్రజలు రగిలిపోతూ ఉద్యమబాట పడుతున్నారని, వారిని చైతన్యవంతం చేయడానికి జనచైతన్య యాత్ర చేపట్టినట్టు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు కృష్ణన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని శివం గార్డెన్స్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జనచైతన్య యాత్ర బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్జు కష్ణన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రూ.15 లక్షలు ఇస్తామన్న బీజేపీ ఎందుకు ప్రజలకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 1,12,000 మంది రైతులు సంక్షోభంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, 2,50,000 మంది దినసరి కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వమే తమ రిపోర్టుల్లో వెల్లడించిందన్నారు. మహారాష్ట్రలో పోషకాహార లోపంతో 9 వేల మంది చిన్నారులు మరణించారని తెలిపారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో దేశం 107వ స్థానానికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఏవని, అగ్నిపథ్ ద్వారా ఎంపికైన అగ్ని వీరులు తమ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత బీజేపీ ఆఫీసుల్లో చౌకీదారుగా పని చేయాలని, పకోడీ అమ్ముకోవాలని అనడం బాధాకరమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ప్రజల హక్కును కూడా ప్రయివేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 5న కార్మిక, కర్షకులతో ఢిల్లీలో ర్యాలీ ఉంటుందని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. మతాన్ని పావుగా వాడుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లబ్ది పొందుతున్నాయన్నారు. గతంలో గ్యాస్ ధర రూ.450 ఉంటే ఇప్పుడు రూ.1,155 చేశారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, పర్యవసానంగా నిత్యవసర ధరలు పెరిగాయని తెలిపారు. ఉపాధి హామీలో పని దినాలు తగ్గించారన్నారు. నిరుద్యోగం పెరిగిందన్నారు. బండి సంజరు తన సీటును, రాష్ట్ర అధ్యక్ష పదవిని కాపాడుకోవడం కోసమే పార్లమెంటులో కరీంనగర్, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. నూతన విద్యా విధానంలో పీజీ, డిగ్రీ చేసేవారు మూడు నెలలు తమ కులవృత్తిని చేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయమన్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్‌తో బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. యాత్ర సభ్యులు ఆశయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం గురించి చేపట్టిన తమ జనచైతన్య యాత్ర 29న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. దీనికి పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ హాజరవుతారని, సిద్దిపేట నుంచి కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. జన చైతన్య యాత్ర బహిరంగ సభకు సీపీఐ, న్యూ డెమోక్రసీ, ఆర్ఎస్పీ నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో జన చైతన్య యాత్ర బృంద సభ్యులు స్కైలాబ్ బాబు, జయలక్ష్మి, బాలకృష్ణ, జగదీష్, అడివయ్య, జన చైతన్య యాత్ర రూట్ ఇన్చార్జి వెంకట్, నాయకులు వెంకటేష్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, జిల్లా నాయకులు దాసరి కళావతి, కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, ఎల్లయ్య, భాస్కర్, సత్తిరెడ్డి, వెంకట్ మావో, కిష్టారెడ్డి, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.