Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులు
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- 9 ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం
నవతెలంగాణ-హయత్ నగర్
తెలంగాణలో ప్రయివేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులు ప్రవేశపెడుతుందని, ప్రజలకు మెరుగైన సేవల కోసం ఏసీ స్లీపర్ బస్సులు నడుపుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఎల్బీనగర్లోని విజయవాడ మార్గంలో 9 ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో వైఫై సౌకర్యం కూడా ఉంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. హైటెక్ హంగులతో ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ తీసుకొస్తుందని చెప్పారు. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వాడుకలోకి తెస్తోందని.. అందులో భాగంగా ప్రస్తుతం 9 బస్సులు ప్రారంభించినట్టు తెలిపారు. ఇవి సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుందని చెప్పారు.
ప్రయాణికులకు మెరుగైన,నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు 'లహరి-అమ్మఒడి అనుభూతి'గా నామకరణం చేసింది. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలు మునిషేకర్, పురుషోత్తం, వినోద్ కుమార్, యాదగిరి, ఎల్బీనగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ,ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.