Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య యాత్రలో..సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, అబ్బాస్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని, మతోన్మాద బీజేపీని కేంద్రంలో గద్దె దించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జనచైతన్య యాత్ర జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్బంగా నెహ్రు పార్క్ వద్ద యాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీ పట్టణంలోని గ్రౌండ్‌కు చేరుకుంది. పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడారు. బీజేపీ మతోన్మాద రాజకీయం చేస్తుందని, బీజేపీ మత రాజకీయాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రజలకు చైతన్యవంతం చేయాలన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా పోరాటం చేసిన గాంధీజీని చంపిన గాడ్సేను బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ దేవుడని ప్రకటించినా ఆమెపై ఇప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. ఈ ఎంపీ ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్ట్టు గతంలో కేసు నమోదై ఉన్నా, ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపిందన్నారు. దేశంలో 23 వేల కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవితాలను దుర్భరం చేశారని తెలిపారు. రాష్ట్రంలో 50 కేంద్రాల్లో పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరుగుతున్నాయన్నారు. కోటి మంది కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని పోరాటాలు చేశారన్నారు. అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన తమ డిమాండ్ల కోసం సమ్మె చేశారని, వేలాది మంది విద్యుత్ కార్మికులు విద్యుత్ సౌధాను ముట్టడించారని తెలిపారు. పేదల కోసం పోరాటం చేసేది ఒక ఎర్రజెండా మాత్రమేనన్నారు. 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో ఇండ్లు లేని పేదలు ఎవరూ ఉండరని హామీ ఇచ్చిన మోడీ ఓట్లు దండుకుని ప్రధాని అయ్యాక హామీని తుంగలో తొక్కారన్నారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను నిర్వహిస్తున్నదని తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ వంటి ప్రమాదకరమైన పురుగు పట్టిందని, ఆ పురుగు వెంటనే నివారించకపోతే దేశం నాశనం అవుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అదానీ కుంభకోణాలు ప్రశ్నించినందుకే ఆయన ఎంపీ పదవిని రద్దు చేశారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ లాంటి పాలన అందిస్తామని చెబుతున్నారని, యూపీలో యువతపై లైంగికదాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రిని అరెస్ట్ చేశారని, బాధితురాలు తరుపున పోరాటం చేసిన నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇది యూపీ కాదు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డ అని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. యాత్రలో బృంద సభ్యులు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మీ, టి. స్కైలాబ్‌బాబు, ఆశయ్య, లెల్లల బాలకృష్ణ, జగదీష్, జిల్లా కార్యదర్గి వర్గ సభ్యులు వెంకట్రాజం, సాంబరాజు, అహల్య, రాపర్తి రాజు, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బొట్ల శేఖర్, బొట్ల శ్రీనివాస్, బూడిద గోపి, తదితరులు పాల్గొన్నారు.