Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ- నకిరేకల్
దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం కానరావడం లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని, ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. మరోవైపు నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శతకోటీశ్వరులను తయారు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను లాక్కుంటుందని, వాస్తవాలను అర్థం చేసుకొని ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ మళ్లీ గెలిస్తే అదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటుపరం చేసి కార్మికులను వీధిన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక విధానం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) దేశవ్యాప్తంగా పోరాడుతుందన్నారు.
పేదల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టులే..
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం.. హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌కు చేరుకున్న జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను ఎండగట్టేందుకు పేద ప్రజల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని చెప్పారు.
ప్రజల కోసం పని చేయడం తప్ప ఏనాడూ అధికారం కోరుకోని వారు కమ్యూనిస్టులేనన్నారు. కమ్యూనిస్టుల ఆలోచన విధానాలు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికుల సంక్షేమం వైపే ఉంటాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిలబడి పోరాడే పార్టీలకు అండగా ఉండి వారి పోరాటాల్లో భాగస్వాములు అవుదామని చెప్పారు. బీజేపీ పెత్తందారుల కొమ్ముకాస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రతిపక్ష పార్టీలపై కక్షగట్టి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, రాచకొండ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.