Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ కోసం ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి
- రాష్ట్రాలపై కేంద్రం కక్ష..అడ్డదారిలో కూల్చాలని కుట్ర:మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల
దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ వ్యక్తులకు తొత్తులుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ లాభాలు అదానీకి ఇస్తుండగా.. చందాలు బీజేపీ వసూలు చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి తొవ్వ చూపుతున్నదని.. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష కట్టి వివక్ష చూపుతూ నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డదారి సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలని చూస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బిల్ సంతోష్ బ్రోకర్‌గా మారి దొంగ స్వాముల ద్వారా తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ఎరగా వచ్చారన్నారు. పీక్ అవర్‌లో 20 శాతం కరెంటు బిల్ పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లును తీసుకొస్తుందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. టీఎస్పీఎస్సీలో జరిగిన లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్ పసలేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నిజమైతే నిరూపించాలని రేవంత్‌రెడ్డి, బండి సంజరుకి సవాల్ విసిరారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎనిమిదేండ్లలో 13 పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడ ఎవరైనా మంత్రి రాజీనామా చేశారా? ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? ఒక్క అధికారినైనా తొలగించారా? అని ప్రశ్నించారు. దేశంలో సింగరేణి, కోలిండియా బొగ్గు ఉన్నదని, నరేంద్ర మోడీ కావాలని ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు. అదానీ కోసం అక్కడి బొగ్గును దిగుమతి చేసుకోమంటున్నారని, రూ.3వేలకు టన్ను బొగ్గును వదులుకొని..
దానికంటే పది రెట్లు విలువ పెట్టి బొగ్గును కొనాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాఖీదులు ఇచ్చిందని చెప్పారు. మోడీ తన దోస్తు అదానీ కోసం బొగ్గునే కాదు విమానాశ్రయాలను సైతం రాసిస్తున్నారని విమర్శించారు. ఒక్క విద్యుత్ రంగానిదే కాదు.. ప్రతి రంగంలోనూ ఇదే కథ ఉందన్నారు. డబుల్ ఇంజిన్ అంటే మోడీ, అదానీ అని విమర్శించారు. ఈ డబుల్ ఇంజిన్ ఇవాళ.. దొంగ పైసలతో రాజకీయ పార్టీలను చీల్చి.. ఎమ్మెల్యేలను కొనాలి.. ఏక్నాథ్ షిండేలను తయారు చేసి ప్రభుత్వాలను పడగొట్టాలని ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు అవే పైసలతో దేశాన్ని ఆగమాగం చేసి.. బీజేపీ ఒక్కటే బతకాలన్నట్టు వ్యవహరిస్తోందన్నారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజరు గెలిచినప్పటి నుంచి ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బండి సంజరు గుజరాత్ వాళ్ల చెప్పులు మోయడానికి పనికొస్తారని.. సిరిసిల్ల అభివృద్ధికి పనిచేయరని అన్నారు. కేంద్రం ద్వారా విద్యాసంస్థలను ఒక్కటి కూడా తేలేని బండి సంజయ్ అమాయకులైన కార్యకర్తలను తనను అడ్డుకోవడానికి పంపిస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కేంద్రం నుంచి సిరిసిల్లకు ఏం చేశారో చెప్పాలన్నారు. కేంద్రం చేస్తున్న అవినీతి, తెలంగాణపై కక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధిపై ఏప్రిల్ 25లోపు గ్రామ గ్రామాన చర్చ జరపాలని ప్రతి గడపకూ విశ్లేషణ చేరాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.