Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వ్యతిరేకత కనిపిస్తున్నది
- యువత స్పందిస్తున్నది. : యాత్ర రథసారధి పోతినేని సుదర్శన్ రావు
''ప్రజల్లో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రకు మంచి స్పందన వస్తున్నది..బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్పష్టంగా చెబుతున్నాం..కుల,మతాల రొచ్చుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్న తీరును జనం దృష్టికి తీసుకుపోతున్నాం..మతోన్మాద ప్రమాదాన్ని సమాజానికి చెబుతున్నాం..వందలాది మోటార్‌సైకిళ్లు, ప్రజానాట్య మండలి బృందాలతో యాత్ర ముందుకు సాగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జనచైతన్య యాత్ర రథ సారధి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. యాత్రలో ప్రజాస్వామ్యం, మతోన్మాదం, సామాజిక న్యాయం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలకు చెబుతున్నామని చెప్పారు. యాత్ర జరుగుతున్నతీరు, ప్రజల స్పందన తదితర అంశాలపై నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి బి.బసవపున్నయ్యకు పోతినేని ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
జన చైతన్య యాత్ర లక్ష్యమేంటి ?
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర చేపట్టింది. సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజికన్యాయం కోసం పార్టీకేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. 17 నుంచి ఈనెల 29 వరకు జరగనున్నాయి. వేలాది కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు పాల్గొంటున్నారు.
మోటార్ సైకిళ్ల ప్రభావం ఎలా ఉంది ?
చాలా బాగుంది. పట్టుదలగా మోటార్ సైకిళ్ల ప్రదర్శన జరుగుతున్నది. దాదాపు 250 మోటార్ సైకిళ్లు యాత్రవెంట రెగ్యులర్ ఉంటుండగా, ఎక్కడిక్కడ స్థానికంగా అదనంగా మరికొన్ని చేరుతున్నాయి.దీంతో గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల గుండా యాత్ర సాగుతున్నప్పుడు మంచి ప్రభావం పడుతున్నది.ప్రజల్లో యాత్ర పట్ల చర్చ నడుస్తున్నది.
ఆటంకాలు ఏమైనా ఉన్నాయా ?
ఆటంకాలు అంటే ప్రకృతి ప్రభావం కొంత ఉంది. భారీవర్షాలు ఒకవైపు, తీవ్రమైన ఎండలు మరోవైపు కొంత ఇబ్బందిపెట్టాయి. అయినా తట్టుకుని జనం కుదులుతున్నారు. యాత్రలో పాల్గొనడానికి యువత ఉత్సాహాంగా ముందుకు వస్తున్నది.
సభలకు ప్రజలు ఎలా వస్తున్నారు ?
భారీగానే వస్తున్నారు. ప్రతిచోట కనీసం వెయ్యి నుంచి నాలుగైదు వేల వరకు ఆ సంఖ్య ఉంటున్నది. వర్షాలు, ఎండలు ఉన్నా, వస్తున్నారు. సాయంత్రం జరిగే సభలకు అధికంగా వస్తున్నారు. భూపాలపల్లిలో దాదాపు ఆరేడు వేల మంది వచ్చారు. కోదాడ, హూజూర్‌నగర్ సభలూ బాగానే జరిగాయి. మిర్యాలగూడలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీతోపాటు వేలాదిమందితో బహిరంగ సభ జరగడం విశేషం. అలాగే నల్లగొండ, నక్రికేకల్, చిట్యాల సభలు సైతం బాగా జరిగాయి. పనుల ఒత్తిడి ఉన్నా పాలేరు, మధిరలో పగటిపూట కూడా సభలు వేలాది మందితో .జరిగాయి.
యాత్ర సందర్భంగా మీ దృష్టికొచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారా?
అవును చాలానే వస్తున్నాయి. వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మిర్చి తదితర పంటలు కోల్పోవాల్సి వస్తున్నది. వీటిపై రైతులు, సాధారణ ప్రజలు స్పందిస్తున్నారు. వినతిపత్రాల రూపంలో యాత్ర దృష్టికితెస్తున్నారు. మిర్చి పంటపై ఖమ్మం జిల్లాలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.
సీఎం స్పందన ఎలా ఉంది ?
ఇటీవల వడగండ్లతో పంటదెబ్బతిన్న జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా బోనకల్‌కు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆహ్వానం మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెళ్లారు. ఆ సందర్భంగా పంట నష్టపరిహారం ఎకరాకు కనీసం రూ. 20 వేలు ఇవ్వాలని అడిగాం. పాత జీవోల ప్రకారం ఎకరాకు రూ.3 వేలే ఇచ్చేవారు. పరిహారం పెంచాలని గట్టిగానే అడిగాం. మొత్తం పరిస్థితులను వివరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది పార్టీ విజయం.
కౌలు రైతుల గురించి ఏమైనా మాట్లాడారా ?
అవును. కౌలు రైతుల గురించి కూడా సీఎంతో తమ్మినేని చర్చించారు. పంటలకు పెట్టుబడి పెట్టేది, నష్టపోయేది కౌలురైతులు కాగా, పరిహారం మాత్రం భూ యాజమానులకు అందుతుందని వివరించాం. అందుకే పరిహారం నేరుగా కౌలురైతులకు ఇవ్వాలని కోరాం. సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
రాహుల్‌గాంధీని ఎంపీగా అనర్హుడని ప్రకటించిన నేపథ్యంలో యాత్ర సందర్భంగా ఎదురైన పరిణామాలేంటి ?
ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై చర్చ జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగట్టిందా ? అని భావిస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఖండించాయి. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఓ పరాకాష్టం.
ఇప్పటివరకు ఎన్ని జిల్లాలు పూర్తయ్యాయి ?
రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల నుంచి ఈ యాత్రలు ప్రారంభమయ్యాయి. మా యాత్ర వరంగల్ నుంచి ప్రారంభమైంది. నేటికి 11 రోజులు. ఎనిమిది జిల్లాల్లో యాత్ర పూర్తయింది. దాదాపు 1200 కిలోమీటర్లు సాగింది. 30కిపైగా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాం. వేలాది మంది ప్రజలు ఈసభల్లో పాల్గొన్నారు. 29న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ దగ్గర జరిగే బహిరంగసభతో ముగుస్తుంది.