Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన వారికి పోడు భూముల పంపిణీకి సిద్ధం
- గృహలక్ష్మి విధివిధానాలను ఖరారు చేయండి
- సీఎస్‌కు సీఎం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలనీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం..తదితర అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం
నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటూ సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. ఈమేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారికి, వ్యవసాయశాఖకార్యదర్శి రఘునందన్‌రావును ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలన్నారు.
గృహలక్ష్మి విధివిధానాలు ఖరారు చేయాలి
అర్హులైన పేదలకు 'గృహలక్ష్మి' పేరిట రూ.మూడు లక్షల ఆర్థిక సాయం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గొర్రెల పంపిణీ
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలన్నారు.
పోడు భూముల పంపిణీకి సంసిద్ధత
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో...అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి సీఎస్‌తో చర్చించారు. నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి.. ఒక లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్ బుక్కులు ముద్రించి సిద్దంగా వున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో.. అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
పేదల ఇండ్ల నిర్మాణానికి సాయం
ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని స్పష్టం చేశారు.
సీతారాముల కళ్యాణ నిర్వహణకు కోటి రూపాయలు
శ్రీరామ నవమి సందర్భంగా 30 న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను సీఎం మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు కళ్యాణ నిర్వహణకోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహౌత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.