Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పరిశ్రమా పెట్టలేదు.. ఉన్నవాటినే అమ్మేస్తున్నారు
- భువనగిరిలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ - భువనగిరి
ప్రజల్లో మత విద్వేషాలను ప్రేరేపించి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుందని, రానున్న కాలంలో బీజేపీ పీడను వదిలించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు ఆ పార్టీ జిల్లా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డప్పు, కోలాటాల కళాకారుల నృత్యాలతో యాత్రకు స్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, బృందం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) భువనగిరి జిల్లా కార్యాలయాన్ని (దుంపల మల్లారెడ్డి భవనం) రాఘవులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బీజేపీ లేదు కానీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. దానికి హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ పెట్టాలని తప్ప ఏనాడూ ఉద్యమంలో పాల్గొనాలన్న ధ్యాస లేదన్నారు. ఫ్యూడల్, వెట్టి చాకిరీ, భూస్వామ్య పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం జరిగిందన్నారు. ఆ విప్లవ పోరాటంలో పాల్గొన్న దుంపల మల్లారెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. 1947 తర్వాత కర్ణాటకలో మత ఘర్షణలకు కారణం ఆర్ఎస్ఎస్ అని తెలిపారు. ఆర్ఎస్ఎస్కు పుట్టిన బిడ్డ బీజేపీ నాడు కర్నాటక రాష్ట్రంలో చేసిన విధంగానే నేడు దేశవ్యాప్తంగా మతకల్లోలం సృష్టించాలని చూస్తోందన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపింది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. మైనార్టీలపై దాడులు చేస్తే హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. బీజేపీ పాలను చూసి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుస్తుందన్నారు.
మేకిన్ ఇండియా ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పి చైనా నుంచి, విదేశాల నుంచి పెద్దఎత్తున సరుకులను దిగుమతి చేసుకున్న ఘనత మోడీదేనని విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ.. అదానీ లాంటి వారికి దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం వెనుక మోడీ కుట్ర ఉందన్నారు. ఇలాంటి కుట్రలు ఎప్పటికప్పుడూ సీపీఐ(ఎం) ఎండగడుతుందని చెప్పారు. దేశంలో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో మోడీ తన జేబు సంస్థలతో భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీ విషయంపై స్పందించడం అభినందనీయ మన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కవిత విషయంలో స్పందించలేదన్నారు. గవర్నర్ కేటీఆర్, కేసీిఆర్పై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. ఫాసిస్టు విధానాలతో వస్తున్న మోడీని అడ్డుకోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మాత్రమే పని చేస్తుందని, కాంగ్రెస్ తన స్థాయికి తగ్గ పోరాటం చేయడం లేదని అభిప్రాయపడ్డారు.
అవినీతి పాలనపై సమర శంఖం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
మోడీ అవినీతి పాలనపై సమర శంఖం పూరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్కీం వర్కర్లు తమ డిమాండ్లను, హక్కులను అడుగుతుంటే పరిష్కరించకుండా మోడీ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారని విమర్శించారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు నిధుల కోత పెట్టారన్నారన్నారు. ఐకేపీ, వీఏఓ స్కీం వర్కర్ల వ్యవస్థను రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆర్టీసీ లాంటి సంస్థలను నిర్వీర్యం చేయడానికి రవాణా రంగంలో కొత్త చట్టాలు తెచ్చారన్నారు. ఆదిలాబాద్ ప్రారంభమైన ఈ యాత్రలో వేలాదిమంది తమ వినతిపత్రాలు అందజేశారన్నారు.
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, బండి సంజయ్, అరవింద్ ఎన్నో మాటలు చెప్పారు తప్ప అమలు చేయలేదని విమర్శించారు. లౌకిక వాదం, సామాజిక వాదం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి ప్రసంగించారు. ఈ యాత్రకు సీపీఐ, బీఎస్పీ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర బృందం సభ్యులు జయలక్ష్మి, లెల్లెల బాలకృష్ణ, స్కైలాబ్ బాబు, ఫైళ్ల ఆశయ్య, జగదీష్, అడివయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
నేడే జనచైతన్య యాత్ర ముగింపు సభ
- హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఏర్పాట్లు
- ముఖ్యఅతిధిగా హాజరుకానున్న ప్రకాశ్ కరత్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ముగింపు సభ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్ హాజరవుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు యాత్రకు నాయకత్వం వహించిన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ ఇతర బృంద సభ్యులు పాల్గొంటారు. ఈనెల 17న వరంగల్‌లో, 23న ఆదిలాబాద్‌లో, 24న నిజామాబాద్‌లో మూడు ప్రాంతాల నుంచి బస్సుజాతాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా జనం జేజేలు పలికారు. ఎర్రజెండాలు కట్టుకుని బైక్ ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీజేపీ-ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలపై ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర జయప్రదంగా సాగింది. రాజ్యాంగాన్ని రక్షిద్దాం, దేశాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రజలను జాగృతం చేసింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణతో నిరుద్యోగులు రిజర్వేషన్లతోపాటు ఉద్యోగాలు ఎలా కోల్పోతారో నాయకులు వివరించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం అయిన మనువాద భావజాలాన్ని చాతుర్వర్ణ వ్యవస్థను, కులవ్యవస్థను కొనసాగించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల సామాన్యులు ఎంత సతమతమవుతున్నారో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాసంక్షేమానికి కోతలు పెడుతూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పించే మోడీ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను వివరించింది. వామపక్ష, అభ్యుదయ భావజాలం బలంగా ఉన్న తెలంగాణలో ప్రజల ఐక్యతకు చిచ్చుపెట్టి రాజకీయంగా బలపడాలన్న బీజేపీ గుట్టును చిత్తుచేసింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనూ సీపీఐ(ఎం) నాయకులు ఈ యాత్రలో ప్రస్తావించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలు, కార్మికులకు కనీస వేతనాలు వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.