Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదవారి నిఖార్సైన జెండాను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి : జనచైతన్య యాత్రలో తమ్మినేని వ్యాఖ్యలు
- ప్రతి కార్యకర్త పనిలో ఉండాలి... ప్రతి గడప తొక్కాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ సాదాసీదా పార్టీ కాదనీ, సమాజాన్ని శతాబ్దాలకాల వెనక్కి తీసుకుపోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కేంద్రంలో బీజేపీ సర్కారు బీసీ గణన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు బీసీ గణన అడుగుతుంటే, ఆ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే, వారి సంఖ్య తేలాల్సిందేనన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో తమ్మినేని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు బీజేపీ వ్యతిరేకమైనదన్నారు. అందుకే మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కులాలను అణగద్రొక్కేందుకు బ్రాహ్మణాధిపత్య వ్యవస్థను స్థాపించాలని కలలు కంటున్నదనీ, అటువంటి ఆటలు సాగన్విబోమని హెచ్చరించారు. దేశంలోని సర్వమతాలు అన్నదమ్ముల్లా బతుకుంటే, వారి మధ్య అగ్గిరాజేసి రాజకీయ లబ్దిపొందుతున్నదని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను, విలువలను ధ్వంసం చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా రాజ్యాంగం పరమ చెత్త అంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యాఖ్యానిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం గడ్డపై ఈసారి ఎర్రజెండా ఎగరాలని చెప్పారు. అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి గడప తొక్కాలని సూచించారు. పేదవారి నిఖార్సైన జెండాను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఏ ఒక్క హామీని బీజేపీ నెరవేర్చలేదు : మల్లు లక్ష్మి
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి విమర్శించారు. ఆపార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణాల్లో పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్యాస్‌బండ ధర రూ 410 ఉంటే, బీజేపీ వచ్చాక రూ 1250కి పెరిగిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఏకాభిప్రాయం లేదనే సాకుతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, మధుసూధన్‌రెడ్డి, జగదీష్, నాయకులు పి.జంగారెడ్డి, రాంచందర్, కందుకూరి జగన్, అంజయ్య, కవిత, ఆలంపల్లి నర్సింహ్మా, రవికుమార్, మంచాల మండల కార్యదర్శి శ్యాంసుందర్, అరుట్ల గ్రామ కార్యదర్శి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
మసీదులను కూల్చేందుకు బీజేపీ పలుగు, పార పట్టుకుని తిరుగుతది : పోతినేని
బీజేపీ అధికారంలోకి వస్తే మసీదులను కూల్చేందుకు పలుగు, పార పట్టుకుని తిరుగుతారని జనచైతన్య యాత్ర రథసారధి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఆపార్టీకి అధికారం లేక పోయినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచి వాలయం గుమ్మటాలను కూల్చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. అయితే మతోన్మాదం గురించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన పనిలేదనీ, ఎందుకంటే పార్టీ నేతలు పాషా, నరహరిని బలితీసుకున్నదని మతోన్మాదులేనని గుర్తు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజరుకుమార్ అంటున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే మసీదులను కూలగొట్టి కింద లింగాలొస్తాయో, శవాలు వస్తాయో చూస్తామంటున్నారని చెప్పారు. లింగాలు వస్తే ముస్లింలు ఆలయాలను కూల్చేశారని చెప్పేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. అటువంటి ముర్ఖులను రాష్ట్రం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నుంచి ప్రజల ఆస్తులను, ప్రజా స్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.
పేదలకు ఒక్క ఇల్లైనా ఇచ్చారా?
తెలంగాణలోని బీజేపీ నాయకులకు దమ్ము.. ధైర్యం ఉంటే నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదలకు ఒక్క ఇల్లునైనా తీసుకొచ్చి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్ డిమాండ్ చేశారు. దేశంలో 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మతోన్మాద, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోందన్నారు. తొమ్మిదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎంతమందికి ఇండ్లు నిర్మించి ఇచ్చిందని ప్రశ్నించారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్మికులను దోచి పెద్దలకు పంచుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న రాష్ట్రాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూకలు దాడులకు తెగబడుతు న్నాయన్నారు. దేశంలో కార్మికవర్గంపై దాడి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, రమ, వెంకట్రాములు, భూపాల్, అరుణజ్యోతి, గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు ధర్మానాయక్, విజరు, సోమన్న, ఆంజనేయులు, బాల్ రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డప్పులతో బైక్‌ర్యాలీ నిర్వహిం చారు. కళారూపాలు ప్రదర్శించారు. ప్రతిచోటా జాత బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.